వేధింపులు.. ఏడిపింపులు కావా మంత్రి వ‌ర్యా!

Update: 2022-12-03 06:30 GMT
తాజాగా ఏపీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఏపీలోని చిత్తూరు జిల్లా శివారు ప్రాంతం క‌ర‌కంబాడిలో ఉన్న అమ‌ర‌రాజా కంపెనీ.. తెలంగాణ‌లో లిథియం అయాన్ బ్యాట‌రీలో త‌యారీ కేంద్రం ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ ఏకంగా 9500 కోట్లు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలోనే .. ఈ ఒప్పందం జ‌ర‌గ‌డం.. ఏపీలో సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై అనేక వార్త‌లు వ‌చ్చాయి.

ఏపీలో ప్ర‌భుత్వ వేధింపుల కార‌ణంగానే ఈ కంపెనీ త‌న విస్త‌ర‌ణ ప్లాంటును తెలంగాణ‌కు మ‌ళ్లించిద‌నేది వార్త‌ల సారాంశం. అయితే, తాజాగా ఈ ఉదంతంపై స్పందించిన రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చిత్ర‌మైన వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు.

మేం ఏడిపించామా?  మేం ఆ కంపెనీని వేధించామా? అలాగని ఆ కంపెనీ మీ చెవిలో చెప్పిందా?  దీనికి రుజువులు ఉన్నాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. అస‌లు కంపెనీ చిత్తూరులోనే అది కూడా ఆంధ్రాలోనే ఉంద‌ని చెప్పుకొచ్చారు. కానీ, వాస్త‌వం ఏంటంటే.. టీడీపీ నాయ‌కుడు, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ను పార్టీ మారాల‌ని ఒత్తిడి చేసింది నిజంకాదా!అంతేకాదు..అమ‌రావ‌తి రాజ‌ధానిపై తీవ్ర‌స్థాయిలో పోరు చేసిన ఎంపీగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. పార్ల‌మెంటులో మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అమ‌రావ‌తికి మీరు శంకు స్థాప‌న చేసి గాలికి వ‌దిలేస్తారా? అని నిల‌దీశారు.

అంతేకాదు.. రాజ‌ధాని రైతులు అసెంబ్లీ ముట్ట‌డికి పిలుపునిస్తే.. మారు వేషంలో పొరుగు ప్రాంతానికి చేరుకుని.. అక్క‌డ నుంచి ఈ ఉద్య‌మాన్ని న‌డిపించారు. ఇవ‌న్నీ.. క‌డుపులో పెట్టుకున్న ప్ర‌భుత్వం ఆయ‌న‌ను ఆర్థికంగా దెబ్బ‌తీసే వ్యూహాన్ని తెర‌మీద‌కి తెచ్చింది వాస్త‌వం కాదా.

ఈ క్ర‌మంలో బ్యాట‌రీ కంపెనీ ఉన్న చిత్తూరులో ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య వ‌చ్చింద‌ని కేసుల‌పై కేసులు పెట్టి.. తాళాలు వేయించిన ప‌రిస్థితిని ఎవ‌రు మాత్రం మ‌రిచిపోయారు. ఇన్ని చేసిన త‌ర్వాత‌.. ఇంకా మేం వేధించామా? అని మంత్రి గారు తాజాగా ప్ర‌శ్నించ‌డం.. ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లుక‌ట్ట‌డ‌మే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News