అమెరికా రణరంగం.. పార్లమెంటులో తుపాకుల మోత.. దిగిపోతానన్న ట్రంప్!

Update: 2021-01-07 17:56 GMT
"కొందరుంటారు.. వారు పుట్టేది ప్రజలకోసమే. బతికేది కూడా వారి కోసమే.. చివరకు మరణించేది కూడా జనం కోసమే"

"మరికొందరుంటారు.. అధికారమే వారి పరమావధి. బతికేది కూడా అధికారం కోసమే. ప్రాణం పోతున్నా కావాల్సింది అధికారమే"

అమెరికా ప్రజాస్వామ్యానికి దాదాపు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది. స్వేచ్ఛ అవసరాన్ని ప్రపంచానికి చాటిచెపుతూ.. అది ఆకాశానికి రెక్క తొడగాలంటూ.. అల్లంత ఎత్తున 'లిబర్టీ ఆఫ్ స్టాచూ'ను నిలబెట్టిన దేశమది. అలాంటి అమెరికాలో నేడు ప్రజాస్వామ్యం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ దుస్థితి ఎంత వరకూ దిగజారిందంటే.. ఏకంగా దేశ పార్లమెంటులోనే తుపాకులు మోగేంత వరకూ! అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ.. కుర్చీ దిగేదే లేదంటూ ట్రంప్ పట్టిన పంతానికి ఫలితం ఈ పరిస్థితి. ఆయన మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ హిల్ ను తుపాకులతో ముట్టడించి రణరంగంగా మార్చేశారు. వాషింగ్టన్ డీసీలోని పార్లమెంట్ భవనంలో సమావేశమైన అమెరికా కాంగ్రెస్.. బైడెన్ విజయాన్ని ఖరారుచేసే ప్రక్రియ చేపట్టింది. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రంప్ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడ్డారు. తుపాకులు, బాంబుల మోత మోగించారు. ఈ ఘటనపై అమెరికా మొత్తం ఆందోళన వ్యక్తం చేయగా.. ప్రపంచం మొత్తం ఈ చర్యను తప్పుబట్టింది.

కేపిటల్ బిల్డింగ్ లో తొలిసారి రక్తపాతం..!
రెండు దశాబ్దాల అమెరికా చరిత్రలో తొలిసారిగా కేపిటల్ బిల్డింగ్ లో రక్తపాతం చోటుచేసుకుంది. తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామిక దేవాలయం లాంటి పార్లమెంటుపై దాడిని పార్టీలకు అతీతంగా అమెరికన్లందరూ ఖండించారు. చివరకు సొంత పార్టీ రిపబ్లిక్ కు చెందిన నేతలు సైతం ట్రంప్ తీరును దనుమాడారు. దీంతో అధ్యక్షుడి అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లూ భీష్మించిన ట్రంప్ ను.. మెడపట్టి బయటకు గెంటేసే కార్యక్రమం తెరపైకి వచ్చింది.

సొంత పార్టీ నుంచీ వ్యతిరేకత..
కేపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరుల దాడి, హింస తర్వాత అమెరికాలో సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ట్రంప్ వైపు నిలవడ్డ ఆ కొద్ది మంది కాస్తా పదవులకు రాజీనామాలు చేశారు. రిపబ్లికన్ పార్టీ సైతం ట్రంప్ ను సమర్థించలేక డిఫెన్స్ లో పడిపోయింది. దేశ చరిత్రలో మాయని మచ్చలాంటి ఘటనకు కారకుడిగా ట్రంప్ మిగిలిపోతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చిట్ట చివరికి అంగీకారం..
గతేడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.  మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ బైడెన్ 306, ట్రంప్ 232 ఓట్లు సాధించారు. దీంతో.. బైడెన్ విజయం ఖాయమైపోయింది. ఎన్నికల కమిషన్ సైతం డెమోక్రాట్లే విజయం సాధించారని ప్రకటించిన తర్వాత కూడా ఫలితాన్ని అంగీకరించడానికి ట్రంప్ నిరాకరిస్తూ వచ్చారు. బైడెన్ గెలుపునకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను చట్టసభ సభ్యులు ధృవీకరించే ప్రక్రియను కూడా ట్రంప్ వ్యతిరేకించారు. కొంతకాలంగా ఇదే వైఖరితో ఉన్న ట్రంప్.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం నుంచి దిగేది లేదని తెగేసి చెప్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం క్యాపిటల్ బిల్డింగ్ లో అధికార మార్పిడి ప్రక్రియ కొనసాగుతోన్న సమయంలో ట్రంప్ మద్దతుదారులు బిల్డింగ్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిని జాతిపై జరిగిన దాడిగా అమెరికన్లు అభివర్ణించారు. ఈ చర్యతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో.. దారులన్నీ మూసుకుపోయాయని గుర్తించిన ట్రంప్.. అనివార్యమైన పరిస్థితుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోతానని అధికారికంగా తొలిసారి ప్రకటించారు. జనవరి 20న జోబైడెన్ కు అధికారాలను బదిలీ చేస్తానని అంగీకరించారు.

ఓటమిని మాత్రం ఒప్పుకోను..
అయితే.. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటికీ.. ఎన్నికల ఫలితాలను, తన ఓటమిని మాత్రం అంగీకరించబోనని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. "ఎన్నికల ఫలితాలతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. అసలు నిజాలేంటో, డెమోక్రాట్లు ఎలా గెలిచారో ముమ్మాటికీ నాకు తెలుసు. అయినాసరే, జనవరి 20న క్రమబద్ధమైన అధికార బదిలీ ఉంటుంది''అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఇది ఆరంభమేనట!
ట్రంప్ చర్యను భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా దాదాపు అన్ని దేశాల అధినేతలూ ఖండించారు. అమెరికాలో జరుగుతోన్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మర్యాదగా అధికార బదిలీ చేపట్టాలని హితవుపలికారు. ఈ విధంగా.. అన్ని వైపులనుంచీ ఒత్తిడి రావడం, అభిశంసన కూడా తప్పదని అర్థమైన తర్వాత ట్రంప్ పదవి నుంచి దిగిపోతానని ప్రకటించారు. అయితే.. ఇది ఆరంభమేనని అన్నారు. అమెరికాను మళ్లీ గొప్పగా చేసే(మేక్ అమెరికా గ్రేట్ అగైన్) పోరాటంలో ఇది(తన వెనుకడుగు) ఒక ఆరంభం మాత్రమేనని ట్రంప్ చెప్పడం గమనార్హం.

నాది గొప్ప పాలన..
ట్రంప్ తనది గొప్ప పాలనగా చెప్పుకున్నారు. అది నాలుగేళ్లలోనే ముగిసిందంటూ బాధపడ్డారు. "అమెరికా చరిత్రలోనే అతి గొప్ప పరిపాలన తొలి టర్మ్ లోనే ముగియనుంది. ఈ క్షణానికి కూడా నేను ఎన్నికల ఫలితాలతో ఏకీభవించడంలేదు. చట్టబద్ధమైన ఓట్లు మాత్రమే లెక్కించాలన్న నా పోరాటాన్ని ఇకపైనా కొనసాగిస్తాను. మేక్ అమెరికా గ్రేట్ అగౌన్ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే'' అని ప్రకటించారు ట్రంప్.

మళ్లీ పోటీ చేస్తారా?
అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ఎవరైనా రెండు సార్లు బరిలో నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి. ట్రంప్ కు మరో ఛాన్స్ ఉంది. 'ఇది ఆరంభమే' అని ట్రంప్ చెప్తున్నాడంటే.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగే సంకేతమేమైనా ఇస్తున్నాడా? అనే చర్చ సాగుతోంది. అయితే.. రిపబ్లికన్ పార్టీ ఈసారి ఆయనకు అవకాశం ఇస్తుందా అనేది అనుమానమే. 'కేపిటల్ భవనంపై దాడి' ఘటనకు ట్రంప్ ను బాధ్యుడిని చేస్తూ శిక్షించే దిశగా అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకున్నా.. ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి, తన ఓటమిని అంగీకరించకుండా.. ఏకంగా పార్లమెంట్ లో దాడికి తన మద్దతు దారులు పాల్పడేందుకు కారణమైన ట్రంప్.. అమెరికా చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి కారకుడిగా మిగిలిపోతాడనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News