వైసీపీ అంటే ఏంటో చెప్పిన జీవీఎల్

Update: 2021-12-24 00:30 GMT
వైసీపీ అంటే ఏమిటి. దాని ఫుల్ ఫాం ఏమిటి అంటే  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని క్యాడర్ అనుకుంటుంది. ప్రజలు కూడా అలాగే  అనుకుంటారు. కానీ ఎన్నికల సంఘం వద్ద మాత్రం యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీగా వైసీపీ  రిజిస్టర్ అయింది. అంటే వైసీపీకి అసలు పేరు అధికారికంగా అదన్న మాట.

కానీ ఆ పేరు కాకుండా మరోటి ఫుల్ ఫాం ఇదేనని దాన్ని ఇలాగే పలకాలని  చెబుతున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆయన చెప్పిన వైసీపీ అసలైన డెఫినిషన్ ఏంటి అంటే  చిత్రమే అనాలి.   వై అంటే ఏమీ, సీ అంటే చేతకాని, పీ అంటే పార్టీ. అంటే ఏమీ చేతకాని పార్టీ వైసీపీ అంటూ భలే సెటైర్ వేశారు జీవీఎల్ గారు.

ఇంతకీ ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందంటే ఏపీలో వైసీపీ సర్కార్  పాలన దశా దిశా లేకుండా సాగిపోతోందిట. అంతే కాదు, ఏపీలో అభివృద్ధి అన్నదే కానరావడంలేదు అంటున్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేని చేతగాని తనంతో  వైసీపీ ఉందని జీవీఎల్ అంటున్నారు.

దేశంలో యూపీతో సమానంగా ఏపీని కేంద్రం నిధులను వెల్లువలా ఇస్తూంటే ఏపీ మాత్రం చేతకాని పాలన చేస్తోందని ఆయన మండిపడ్డారు. అంతటితో అని  ఈ బీజేపీ ఎంపీ ఊరుకోలేదు, ఏపీలో ఆర్ధిక రంగం ఎలా కుదేల్  అయింది అన్న దాని మీద ఎవరైనా  కేస్ స్టడీ చేయడానికి చాలా  బాగుంటుంది అని ఎద్దేవా చేస్తున్నారు.

మొత్తానికి ఏపీలో వైసీపీ పనితీరు అసలు బాగోలేదు అని జీవీఎల్ గర్జిస్తున్నారు. ఇప్పటిదాకా వైసీపీని విమర్శించిన వారు ఉన్నారు, జగన్ని మంత్రులను, ఇతర నేతలను గట్టిగా మాటలు అన్న వారు ఉన్నారు కానీ ఇలా ఏకంగా వైసీపీకే కొత్త నిర్వచనం చెప్పిన వారు లేరు. మరి ఆ పని చేసిన జీవీఎల్ తన మాటల ధాటిని ఇదే తీరున కంటిన్యూ చేస్తారా, చూడాలి.

ఇంతకీ జీవీఎల్ ఇంత పెద్ద  మాట అనేశాక వైసీపీ నుంచి సరైన తీరులో కౌంటర్లు ఉంటాయా. ఉంటే ఏ రేంజిలో ఉంటాయి. లేకపోతే జీవీఎల్ ఏమన్నా కూడా పూలతో సుతిమెత్తగా కొట్టినట్లుగానే ఉందని భావించేసి ఊరుకుంటారా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News