కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌...బాబుకు ఓ భ్ర‌మ‌

Update: 2018-12-17 15:23 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిప‌డ్డారు. తుపాన్ కారణంగా ఏపీలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డార‌ని ఇలాంటి ప్రకృతి విపత్తు స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో  కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లడం సరికాదని ఆయ‌న అన్నారు. త‌ను ఏం చేసినా సమర్థించుకోవడం, ఎదుటి వాళ్లు చేస్తే నిందించడం చంద్రబాబుకు అలవాటని ఆయ‌న ఎద్దేవా చేశారు. తితిలీ తుపాన్‌కు సాయంగా కేంద్రం ఇచ్చిన నిధులనే ఇంకా పూర్తిగా వాడలేదని జీవీఎల్ పేర్కొన్నారు. మొదటి మూడు సంవత్సరాలలో రూ.1247 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని, వాటిని ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారో  చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది రూ.299 కోట్లు ఒకసారి, రెండో విడత మరో  రూ.299 కోట్లు కేంద్రం ఇచ్చిందని పేర్కొంటూ...ఇవన్నీ సద్వినియోగం చేశారా... పక్కదారి మళ్లించారా అనేది ప్రజలకు చెప్పాలని అన్నారు.

ఇప్పటికైనా ప్రజా సమస్య పరిష్కారానికి చంద్రబాబు కృషి చేయాలని లేకుంటే తెలంగాణ లో తరహాలో ఓటమి తప్పదని ఎంపీ జీవీఎల్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణాలో టీడీపీతో కలవడం వల్లే నష్టపోయామని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా నే చెబుతున్నారని ఆయ‌న వెల్ల‌డించారు. టీడీపీ జాతీయ పార్టి అని చంద్రబాబు అండ్ కో తప్ప ప్రజలు, ఇతర పార్టీల నేతలు  ఎవరూ భావించడం లేదని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

తెలంగాణాలో బీజేపీ, టీఆర్ఎస్‌కు దోస్తీ ఉందంటూ దుర్మార్గపు ప్రచారం చేశారని జీవీఎల్ పేర్కొన్నారు. ప్రజలు వారి మాయమాటలు నమ్మకుండా టీఆర్ఎస్‌ను గెలిపించారని అన్నారు. తెలంగాణ‌లో వ‌లే చంద్రబాబుకు ఏపీలో కూడా ఓటమి తప్పదని ఆయ‌న స్ప‌ష్టం చేశౄరు. ``అన్నివేళలా అసత్యాలు, మాయలతో ప్రజలను మోసం చేయలేరు. తెలంగాణలో బీజేపీ ఓటమి మమ్మలను నిరుత్సాహ పరిచింది, కానీ ఓట్ల శాతం పెరిగింది. కాంగ్రెస్, చంద్రబాబు కలవడం వల్ల కేసీఆర్ పై సెంటిమెంట్ మరొకసారి పని చేసింది. టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ రావడానికి చంద్రబాబే ప్రధాన కారణం. కేసీఆర్ రిటన్ గిప్ట్ ఇస్తే తనకు లాభిస్తుదనుకోవడం  చంద్రబాబు భ్రమ అని ఎద్దేవా చేశారు.

రాఫెల్ కుంభకోణంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామ‌ని జీవీఎల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అసత్యాలను ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, చంద్రబాబు, ఇతర నాయకులు అబద్దాల చక్రవర్తులుగా పేరు గడించారని, ఎవరి ద్వారా సమాచారం వస్తే ఈ అబద్దాలను ప్రచారం చేశారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో కన్నా బీజేపీ హయాంలో తక్కువ ధరకే కొనుగోళ్లు జరిగినట్లు కోర్టు నిర్దారించిందన్నారు.

భారత రక్షణ, జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ``జాతీయ భద్రతకు ముప్పు వచ్చేలా వ్యవహరించడానికి అసలు కారకులెవరు? రాహుల్ గాంధీ స్పందించకపోతే పార్లమెంటులో చర్చ పెట్టి నిలదీస్తాం. అకారణంగా బీజేపీపై నిందలు వేసిన రాహుల్ గాంధీ, చంద్రబాబులు చెంపలు చేసుకుని తప్పయిపోయిందని అంగీకరించాలి. ఫ్రాన్స్‌, భారత్‌ల మధ్య అధికారికంగా జరిగిన  అగ్రిమెంట్ వల్లే తక్కువ ధరకు కొనుగోళ్ళు చేశాం. యూపీఏ సమయంలో చర్చ జరిగినా...ఆనాడు కన్నా 20శాతం తక్కువకు మేము కొనుగోళ్లు చేశాం. కాంగ్రెస్ హయాంలో ముడుపులు దక్కలేదనే అగ్రిమెంట్ నిలిపివేశారని భావిస్తున్నాం. జాతీయ విద్రోహ చర్యలకు పాల్పడిన రాహుల్ గాంధీ బండారాన్ని ప్రజలకు వివరిస్తాం`` అని ప్ర‌క‌టించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మోడి ప్రభంజనంతో మరోసారి అధికారంలోకి వస్తామనే నమ్మకం, ధీమా ఉంది అని ఆయ‌న తెలిపారు.
Tags:    

Similar News