బాబు..ప‌స‌లేని ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ..అంబాసిడ‌ర్ కారు

Update: 2018-04-04 14:02 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై కేంద్రంలో అధికార బీజేపీ ఎదురుదాడి చేసింది. ఢిల్లీ వేదిక‌గా త‌మ‌ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డం, విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రి ఆరోప‌ణ‌లు గుప్పించిన‌ నేప‌థ్యంలో బీజేపీ ముఖ్య‌నేత‌లు రంగంలోకి దిగారు. కేంద్ర‌మంత్రి ప్ర‌కాశ్ జ‌వదేక‌ర్, బీజేపీకి చెందిన ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ప్ర‌త్యేక విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు. `మామగారు అల్లుడికి అంబాసిడర్ కార్ ఇస్తామని ప్రామిస్ చేస్తే..  అది ఆగిపోయింది... కొత్త కారు ఇస్తాను అంటే ... ఒప్పుకోవాలి. ప్రొడక్షన్ ఆగిపోయిన పాత అంబాసిడర్ కావాలి అని చంద్ర‌బాబు కోరుతున్నారు` అంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి మా పాత పార్టనర్ మాపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. `ఏపీకి విద్య సంస్థలను మేము కేటాయించాము. ఐఐటీ ఇచ్చాము. ఐఐఎం కేటాయించాము. ఐఐఐటీ నిర్మాణం ప్రారంభం అయ్యింది. ఇలా తక్కువ సమయంలోనే విద్యా సంస్థలను కేటాయించాము. ట్రైబల్ యూనివర్సిటీ ప‌నులు ప్రారంభం అయ్యాయి.పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయిస్తున్నాం.పెట్రోలియం, హైవేస్ పై భారీ పెట్టుబడులు పెట్టాం. మాకు ఏ ప్రాంతం మీద కక్ష లేదు... ఉండదు కూడా. మేం అందరి అభివృద్ది కోరుకుంటున్నాం.` అని  తెలిపారు. బీజేపీతో పొత్తు వల్ల త‌మకు 15 సీట్లు త‌క్కువ‌గా వచ్చాయని చంద్రబాబు చెప్పడం సరికాదని జ‌వ‌దేక‌ర్ అన్నారు. వైసీపీకి బీజేపీ దగ్గర అవుతోందంటూ ప్రచారం చేయడం ఏమిట‌ని ప్ర‌వ్నించారు. `ఆంధ్రకు ఎక్కువ నిధులు ఇస్తున్నామంటూ ఇతర రాష్ట్రాలు అంటున్నాయి. ఆంధ్రకు రాజధాని లేదని సర్ది చెప్తున్నాం` అని అన్నారు.

జీవీఎల్ న‌ర‌సింహ‌రావు మాట్లాడుతూ చంద్రబాబు వాదనలో పసలేదని ఎద్దేవా చేశారు. `విశ్వాసం లేని ఆరోపణలు, భ్రమలు క‌ల్పించే రాజకీయాలు చేస్తున్నారు. ఇందుకోసం పసలేని పవర్ పాయింట్  ప్రజెంటేషన్ చేశారు. ఆరోపణలు చేస్తేనే నిలబడతాయ‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నారు. యూపీఏతో పోలిస్తే 107 శాతం ఎక్కువ నిధులు కేటాయించాము. దీన్ని పొగడాల్సింది పోయి... ఆరోపణలు చేస్తున్నారు. పెద్దమొత్తంలో ఆంధ్రకు నిధులు ఇచ్చాము. కాని బాబు ... ప్రజలను దగా చేస్తున్నారు` అంటూ మండిప‌డ్డారు. స్పెషల్ స్టేటస్ అంటూ ... పేరు కోసం పాకులడటం సరికాదని జీవీఎల్ అన్నారు. `స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. 2013లో రఘురాం రాజన్ కమిటీ ఏర్పాటు చేస్తే స్పెషల్  స్టేటస్ ఇవ్వొద్దని చెప్పింది. ఈ వ్యవస్థలో అసలు స్పెషల్ స్టేటస్ లేదు. అయినా ఆయ‌న అదే కోరుతున్నారు. మామగారు అల్లుడికి అంబాసిడర్ కార్ ఇస్తామని హామీ ఇస్తే..అది ఆగిపోయింది... కొత్త కార్ ఇస్తాను అంటే ... ఒప్పుకోవాలి. ప్రొడక్షన్ ఆగిపోయిన పాత అంబాసిడర్ కావాలి అంటే ఎలా? ` అంటూ బాబు తీరును ఎత్తిపొడిచారు. `రాజ‌ధాని ప్రాంతంలో డ్రైనేజీ కోసం 1000 కోట్లు ఇస్తే 200 కోట్లే ఖర్చు చేశామని చెబుతోంది. వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టడం లేదు...డబ్బును వెనక్కి తీసుకోలేదు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి ... ఒక డాక్యుమెంట్ అయిన చూపించండి. మభ్యపెట్టే రాజకీయాలు మేము చెయ్యం. ఆంధ్రకు అన్యాయం జరగడానికి ప్రధాన కారణం  కాంగ్రెస్ .. వారు స్టేటస్ అంటూ మళ్ళీ మభ్యపెడుతున్నారు. అభివృద్ధే మా నినాదం . రాజకీయ ఆరోపణలను తిప్పుకోడతాం` అని తేల్చిచెప్పారు.
Tags:    

Similar News