జీవీఎల్ మాట.. ఏపీ విషయాల్లో కేంద్రం జోక్యం లేదంతే

Update: 2020-08-19 03:30 GMT
దేశంలోని రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. ఏఏ అంశాల్లో రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఉంటుంది? ఏఏ అంశాల్లో ఉండదన్న విషయంపై కూడా ఓ స్పష్టత అయితే ఉంది. అయితే ప్రతి చిన్న విషయంలో రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఉండదు. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు, మరికొన్ని కీలక వ్యవహారాల్లో రాష్ట్రాల నిర్ణయాలపై కేంద్రం జోక్యం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు... ఏపీకి సంబంధించిన ఏ విషయంలో కూడా జోక్యం చేసుకునే ప్రసక్తే లేదన్నట్లుగా బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వస్తోంది.

మొన్నేమో ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం అస్సలే ఉండదంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు. నిన్నేమో ఏపీ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల వ్యవహారంలోనూ కేంద్రం జోక్యం ఉండదని జీవీఎల్ చెప్పేశారు. తాజాగా ఏపీలో రచ్చరచ్చగా మారిన జడ్జీల ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేంద్రం జోక్యం ఉండబోదని జీవీఎల్ సూత్రీకరించారు. అంటే.. జీవీఎల్ వ్యవహారం చూస్తుంటే... ఏపీకి సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదన్న మాటేగా. ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారు... ఏ విషయంలో అయినా తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటూ సాగితే... వాటితో కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేదని, అసలు జగన్ సర్కారు నిర్ణయాల్లో కేంద్రం ఎంతమాత్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ చెప్పినట్టే కదా అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

మూడు రాజధానుల అంశమే తీసుకున్నా... విశాఖలో పెట్టానుకుంటున్న కార్వనిర్వాహక రాజధాని, అమరావతిలో కొనసాగించనున్న శాసన రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం లేకున్నా.. కర్నూల్లో ఏర్పాటు చేయనున్న న్యాయ రాజధాని విషయంలో కేంద్రం అనుమతిస్తేనే కదా... జగన్ సర్కారు ముందుకు కదలడానికి ఆస్కారం ఉంటుంది. అమరావతి నుంచి హైకోర్టు కర్నూలుకు తరలాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి కదా. మరి మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ ఎలా చెప్పగలిగారు?. తాజాగా జడ్జీల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా తీవ్రమైన అంశమే. దీనిపై కూడా కేంద్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ చెప్పడం నిజంగానే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.
Tags:    

Similar News