ధోని బర్త్ డే స్పెషల్ : క్రికెట్ ప్రపంచానికి మకుఠంలేని 'మహారాజు' .. చరిత్రలో ఏకైక కెప్టెన్ !

Update: 2021-07-07 10:30 GMT
మహేంద్ర సింగ్ ధోని ... ఎమ్ ఎస్ ధోని. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ ఆట గురించి తెలిసిన , తెలియని వారికి సైతం ధోని గురించి తెలుసు. అంతటి అభిమానం గల స్టార్ క్రికెటర్. మిస్టర్ కూల్ గా ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారతలో క్రికెట్‌ అనే పదం బతికున్నంతవరకు ధోని పేరు చిరస్థాయిగా ఉంటుంది. భారత క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్‌ గా నిలిచిన ధోని నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

రాంచీలో జన్మించిన ధోనీ ఇండియా కు ఎన్నో తిరుగులేని విజయాలు అందించాడు. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటుగా  టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌ కు అందించాడు. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ ఒక్కడే కావడం విశేషం. కెరీర్ ఆరంభంలో హెలికాప్టర్ షాట్‌ తో అభిమానులను అలరించిన మహీ.. కెప్టెన్‌ అయ్యాక ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఆలోచిస్తూ మిస్టర్ కూల్‌గా పేరొందాడు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌ పై తొలి వన్డే ఆడిన ధోనీ.. 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో చివరి వన్డే ఆడాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. ఇక 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్న ధోని క్రికెట్‌ అభిమానులకు షాకిచ్చాడు. తన 16 ఏళ్ల కెరీర్‌లో అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా ప్రశంసలతో పాటు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు ధోని.  

భారత క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత అంతటి క్రేజ్‌ ను సొంతం చేసుకున్న ఆటగాడు ధోని మాత్రమే. ఎమ్ ఎస్ ధోని టెస్టులు, ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో, అత్యధిక మ్యాచ్లు గెలిచి కెప్టెన్సీ రికార్డులు సృష్టించాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి వన్డే  కెప్టెన్సీ తీసుకున్న ధోని తన మొదటి కెప్టెన్సీ తోనే శ్రీలంక, న్యూజిలాండ్ తో వీరోచిత పోరాటం తో ఘన విజయాన్ని తీసుకువచ్చారు. ఐసీసీ  ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2008,2009 ట్రోఫీ తీసుకున్నాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్‌లో 11 ఏళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. మూడుసార్లు కప్ అందించడంతోపాటు  పది సీజన్లలో జట్టును ప్లేఆఫ్ చేర్చాడు.  ధోని క్రికెట్ ఆడే కంటే ముందు భారతీయ  రైల్వే సంస్థలో పని చేసేవాడు.2003 లో బీసీసీఐ  నిర్మించిన టాలెంట్ యాక్టివేషన్ లో భాగంగా జంషెడ్ పూర్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ధోనికి పెద్ద బ్రేక్ లభించింది. అంతే కాకుండా ధోని ఫుట్బాల్, బ్యాడ్మింటన్ కూడా చాలా బాగా అడగలడు. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సాక్షిని జూలై 4-2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుతురు ఉంది.ధోని కుమార్తె పేరు జీవ ధోని.

ఎంఎస్‌ ధోని డిసెంబర్‌ 23, 2004లో బంగ్లాదేశ్‌ తో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ లో అరంగేట్రం చేశాడు. కానీ మొదటి మ్యాచ్‌ లో తొలి బంతికే అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని ఇన్నింగ్స్‌ ల పాటు అంతగా ఆకట్టుకోలేకపోయిన ధోని  2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ తో జరిగిన వన్డే సిరీస్‌ టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌ లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోని టీమిండియా తరపున వికెట్‌ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ కు ముందు ఎవరు ఊహించని విధంగా ద్రవిడ్‌ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ లో అండర్‌ డాగ్స్‌ గా బరిలోకి దిగిన ధోని సేన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ పై విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఇక్కడి నుంచి ధోని క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది.  అప్పటికే భారత విజయవంతమైన కెప్టెన్‌ గా ముద్రపడిన ధోని 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ లో భారత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.

ఇక కెప్టెన్ గా కాకుండా ఓ ఆటగాడిగాను ధోని తనదైన ముద్ర వేశాడు. టీమిండియా తరపున 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు సాధించాడు. ఇక వికెట్‌ కీపర్‌ గా సూపర్‌ సక్సెస్‌ సాధించిన ధోని మెరుపు స్టంపింగ్స్‌కు పెట్టింది పేరు. అన్ని ఫార్మాట్లు కలిపి 195 స్టంపింగ్స్‌ చేసిన ధోని వికెట్‌కీపర్‌గా 634 క్యాచ్‌ లు అందుకున్నాడు. ఇండియా తరపున అన్ని ఫార్మాట్లు కలిపి ఎక్కువ మ్యాచ్‌ లకు కెప్టెన్సీ నిర్వహించిన ఆటగాడిగా ధోని నిలిచాడు. మొత్తంగా 331 మ్యాచ్‌ ల్లో కెప్టెన్‌ గా పనిచేసిన ధోని 178 విజయాలు అందుకున్నాడు. క్రికెట్‌ లో అత్యధిక సిక్స్‌ లు కొట్టిన బ్యాట్స్‌ మెన్లలో  ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న ధోని జీవితంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని , మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...
Tags:    

Similar News