కొత్త నియోజకవర్గాలకు నో ఛాన్స్

Update: 2015-12-08 09:27 GMT
రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఎందరో ఎమ్మెల్యేల పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొత్త రాష్ట్రాలుగా ఏర్పడడంతో కొత్త నియోజకవర్గాలు, కొత్త జిల్లాలు ఏర్పడి పదవులు పెరుగుతాయని చాలామంది ఆశించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేశాయి. కానీ, కేంద్రం మాత్రం ఇప్పట్లో అంత సీను లేదని తాజాగా చెప్పేసింది. 2026 వరకు నియోజకవర్గాల పెంపు ప్రసక్తే ఉండదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధురి మంగళవారం పార్లమెంటులో చెప్పేశారు.

నియోజకవర్గాల పెంపు విషయమై తెలంగాణ రాష్ట్రం తరఫున కరీంనగర్ ఎంపీ బి.వినోద్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఎంపీలూ గతంలోనే ఈ విషయంపై లేఖ రాశారు. దీంతో రెండు రాష్ట్రాల ఎంపీలు కలిసే ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడారు. కానీ... నిబంధనలు ఏమాత్రం అనుకూలంగా లేవంటూ కేంద్రం చేతులెత్తేసింది. ఆర్టికల్ 170 ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని తేల్చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లో రాజకీయ జీవితంలో తొందరగా ప్రమోషన్లు కొట్టేయాలనుకుంటున్న నేతలంతా షాకవుతున్నారు.

ఏపీలో 175 - తెలంగాణలో 119 నియోజకవర్గాలు  ఉండగా ఏపీలో 225 - తెలంగాణలో 150 సీట్లకు పెంచాలని భావించినా నిబంధనల వల్ల అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలూ నియోజకవర్గాల పెంపు కోసం 2026 వరకు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News