సిద్ధిపేట‌లో హ‌రీశ్ భావోద్వేగం

Update: 2018-12-19 11:09 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నుంచి ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజారిటీ తో ఘ‌న విజ‌యం సాధించారు టీఆర్ ఎస్ ముఖ్య నేత త‌న్నీరు హ‌రీశ్ రావు. అంత‌టి మెజారిటీ రాష్ట్రంలో ఎవ‌రికీ ద‌క్క‌లేదు. ఆయ‌న విజ‌యం దేశ‌వ్యాప్తం గా ప‌లువుర్ని ఆక‌ర్షించింది. అతి చిన్న వ‌య‌సులోనే ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయ‌న సాధించిన ఘ‌న‌త గురించి అంతా చ‌ర్చించుకున్నారు.

తాజాగా బ‌తుక‌మ్మ చీరల పంపిణీ కోసం హ‌రీశ్‌ సిద్ధిపేట‌లో బుధ‌వారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు అద్వితీయ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి భావోద్వేగ ప్ర‌సంగం చేశారు. ఎన్ని జన్మలెత్తినా తాను సిద్దిపేట ప్రజల రుణం తీర్చుకోలేన‌ని అన్నారు. నిజానికి తన చర్మం ఒలిచి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు చెప్పులు కుట్టించినా తక్కువేనని పేర్కొన్నారు. త‌న ఊపిరి ఉన్నంత‌ వరకు ప్రజల కోసమే పని చేస్తానని హమీ ఇచ్చారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే నాయ‌కుణ్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామ‌ని సిద్ధిపేట ప్ర‌జ‌లు నిరూపించార‌ని అన్నారు. ఇత‌ర బాధ్య‌త‌ల నేప‌థ్యంలో తాను నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిర‌గ‌లేక‌పోయాన‌ని.. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు తామే పోటీ చేస్తున్న‌ట్లు వ‌చ్చి ఓట్లు వేశార‌ని తెలిపారు.

సిద్ధిపేట‌ లో త‌న విజ‌యాన్ని టీఆర్ ఎస్ అధినేత  కేసీఆర్ కు హ‌రీశ్ అంకిత‌మిచ్చారు. త‌న విజ‌యంలో కేసీఆర్ పాత్ర ఉంద‌ని చెప్పారు. సాధార‌ణంగా కొన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు త‌మ‌కు మంచి నాయ‌కుడు ఉన్నాడ‌ని ఆనందిస్తుంటార‌ని హ‌రీశ్ తెలిపారు. త‌న ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కు మంచి ప్ర‌జ‌లు దొరికార‌ని తాను సంతోషిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింద‌ని హ‌రీశ్ అన్నారు. ప్రజలు తమ మీద ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటామ‌ని పేర్కొన్నారు. తన మీద అభిమానం ఉన్న వాళ్లు బొకేలు, శాలువాలు తేకుండా చెట్ల‌ను పెంచాలని హ‌రీశ్ సూచించారు.

    
    
    

Tags:    

Similar News