కోదండ‌రాం డ‌బుల్ గేమ్ ఆడుతున్నారా?

Update: 2016-10-24 04:54 GMT
రైతు దీక్ష పేరుతో ఇందిరా పార్క్ వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్య‌మకారుడిగా ఉన్న కోదండ‌రాం ఇపుడు స్వ‌రాష్ట్రం సాధించిన త‌ర్వాత తెలంగాణ అభివృద్ధి వ్య‌తిరేకుల‌తో జ‌ట్టుక‌ట్టార‌ని ఆరోపించారు. ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తుంటే - ఉద్యమం పేరిట కాంగ్రెస్‌-టీడీపీలకు తొత్తుగా మారి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ విషయంలో రైతులకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే హైదరాబాద్‌ లో రైతులకు సాగునీరు అందించాలని దీక్ష చేపట్టడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శమని హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. కోదండ‌రాంకు స్ప‌ష్ట‌త లోపించిందా లేక‌పోతే ప్ర‌తిప‌క్షాల చేతుల్లో బందీ అయ్యారా అనేది ఆలోచించుకోవాల‌న్నారు.

ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టులు దక్కించుకొని నామమాత్రంగా ప‌నులు చేసి కోట్లాది రూపాయలను దండుకున్న కాంగ్రెస్ - టీడీపీల సంగతి ప్రజలకు తెలుసు కానీ కోదండరాంకు తెలియన‌ట్లుంద‌ని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. అదే పనిగా విప‌క్షాల‌కు అమ్ముడు పోయిన‌ తొత్తు వ‌లే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం మంచి పరిణామం కాదని హ‌రీశ్ రావు పేర్కొన్నారు. తాము చెప్పిన మాట ప్రకారం అన్నింటినీ ప్రణాళిక ప్రకారం అమలుచేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను పుణరుద్ధరించామని, ఆ విషయం ప్రపంచమే గుర్తించందని, కానీ కావాలని రాజకీయ లబ్ధికోసం రైతు ఉద్యమాల పేరిట ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పడమే కాదు ఇచ్చి తీరుతున్న ఘనత కేసీఆర్‌దేనని హ‌రీశ్ రావు తెలిపారు. తాము రైతన్నల కోసం ముందు చూపుగా వ్యవహరించడం వల్లే నేడు చెరువులు పూర్తిగా నిండుకుని రైతులకు బాసటగా నిలిచాయన్నారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని తాము ఎంతో కష్టపడి కుదిర్చితే అసలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాజెక్టులపై అవగాహన లేదని కోదండ‌రాం వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని హ‌రీశ్ రావు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News