హరీశ్ ఎదురుదాడి చేస్తే ఇలా ఉంటుంది మ‌రి!

Update: 2016-11-06 07:33 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర భారీనీటిపారుదల - మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌ రావు విమ‌ర్శ‌లు-ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేయాల‌ని సంక‌ల్పించిన నేప‌థ్యంలో హ‌రీశ్ తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ పై సైతం విరుచుకుప‌డ్డారు. టీడీపీ నేతలు ఉచిత విద్యుత్ సాధ్యం కాదని - వ్యవసాయం దండుగని అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను ప్రజలు మరిచిపోలేదన్నారు. కరెంటు అడిగితే పిట్టల్లా కాల్చి చంపిన దుర్మార్గం టీడీపీ పాలనలో జరిగిందని హ‌రీశ్ రావు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చివరి నిమిషం వరకు అడ్డుపడిన చంద్రబాబు బొమ్మతో టీడీపీ నాయకులు ఇంకేం పాదయాత్రలు చేస్తారని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులను - కరెంటును - రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీ తరఫున పాదయాత్రలు చేస్తామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని హ‌రీశ్ రావు ఎద్దేవాచేశారు.

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చేయించిన సర్వేలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌ గా నిలిచిందని మంత్రి హ‌రీశ్ రావు గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అంత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో సీఎం కేసీఆర్ తొలిస్థానంలో నిలిచినట్లు సర్వేల్లో వెల్లడైందన్నారు. ఇవి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 109 స్థానాలు టీఆర్‌ ఎస్‌ కు - రెండు కాంగ్రెస్‌ కు వస్తాయని సర్వేల్లో తేలిందన్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ ఎందుకు పాద‌యాత్ర చేస్తుంద‌ని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు మెచ్చుకుంటుంటే, ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ నేతలు కుళ్లుకుంటున్నారని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు.  2009 ఎన్నికల మ్యా నిఫెస్టోలో పొందుపరిచిన ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఇప్పుడేమో ప్రజలపై కపటప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 మ్యానిఫెస్టోతోపాటు ఇవ్వని హామీలను అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని..వారితో త‌మ‌కు పొంతన ఎక్కడిదని ప్ర‌శ్నించారు. కళ్ల‌ముందు అభివృద్ధి జరుగుతుంటే కల్లబొల్లి మాటలు మాట్లాడితే ఎవరూ నమ్మరని హ‌రీశ్ రావు మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో సహా పలు జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరు వెల్లడైందన్నారు. కాంగెస్‌ కు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ - టీడీపీల హయంలో చెరువులన్నీ ధ్వంసమయ్యాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మిషన్ కాకతీయ పథకంలో చెరువులన్నీ పూర్వ వైభవం సంతరించుకున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో చేప పిల్లలకు కోటి రూపాయలు ఇస్తే, ప్రసుత్తం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఉత్తర తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News