మేనమామ కలను పూర్తి చేసిన హరీశ్

Update: 2016-12-06 03:19 GMT
తెలంగాణ రాష్ట్రంలో నాయకులు ఎంతమంది ఉన్నా..టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనల్లుడిగా సుపరిచితుడైన మంత్రి హరీశ్ రావు స్టైల్ కాస్త భిన్నం. విషయం ఏదైనా సరే.. పార్టీ చీఫ్ కమ్ మేనమామ కోరినంతనే.. ఆయనకు కొండంత అండగా నిలబడే తత్వం ఆయన సొంతం. రెక్కలు ముక్కలు చేసుకొని.. పార్టీ కోసం విధేయుడిగా వ్యవహరించినా.. మేనమామకు నమ్మినబంటుగా ఉన్నప్పటికీ.. తనకు దక్కాల్సినంత గౌరవం దక్కటం లేదన్న బాధను ఇసుమంత కూడా వ్యక్తం చేయని విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం.

అభిమానించే వారు లక్షల్లో ఉన్నప్పటికీ.. నిత్యం కష్టపడే వైనం హరీశ్ లో కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రాజెక్టు ఏదైనా.. బాధ్యత మరేదైనా చాలెంజింగ్ గా తీసుకొని.. అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేసే తత్వం ఆయన సొంతం. అందుకేనేమో.. కీలక బాధ్యతలు.. టాస్క్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ ..హరీశ్ కు అప్పగించటం కనిపిస్తోంది.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశాన్ని క్యాష్ లెస్ లావాదేవీలు జరిగేలా మార్చాలని కంకణం కట్టుకున్న ప్రధాని మోడీ.. తన మనసులోని మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాసింత ముందే చెప్పినట్లుగా చెబుతారు. అందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. నగదు రహిత లావాదేవీల్ని పోత్సహించేందుకు తాను కంకణబద్ధుడినై ఉంటానన్న మాట ప్రధానికి కేసీఆర్ ఇచ్చినట్లుగా చెప్పటమే కాదు.. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని చెప్పినట్లుచెబుతారు.

ఇందుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ కు ఈ గురుతర బాధ్యతను కేసీఆర్ అప్పజెప్పారు. పని అప్పగించింది మొదలు.. దీని మీదనే ఉన్న హరీశ్.. తాజాగా తాను అనుకున్నది సాధించారని చెప్పాలి. దక్షిణాదిన తొలి క్యాష్ లెస్ గ్రామంగా మార్చటంలో హరీశ్ తన జాదూతనాన్ని ప్రదర్శించారు. ఎంతో క్లిష్టమైన ఈ వ్యవహారాన్ని.. కమిట్ మెంట్ తో హరీశ్ రావు సాధించారని చెప్పాలి. తాను ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ ను తొలి క్యాష్ లెస్ విలేజ్ గా తీర్చిదిద్దారు.

హరీశ్ దత్తత గ్రామం.. భవిష్యత్ క్యాష్ లెస్ లావాదేవీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం ఆసక్తికరమని చెప్పాలి. ఈ ఘనత క్రెడిట్ ను హరీశ్ కే కట్టబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాలి. క్యాష్ లెస్ లావాదేవీల్ని ఎలా నిర్వహించాలన్న విషయానికి మిగిలిన గ్రామాలకు ఇబ్రహీం పూర్ ఆదర్శంగా మారుతుందన్న ఆశాభావాన్ని హరీశ్ వ్యక్తం చేస్తున్నారు. అంతటా హరీశ్ ప్రదర్శించిన కమిట్ మెంట్ ను చూపిస్తే.. ఆయన ఆశలు ఏ మాత్రం నిరాశ అయ్యే ఉండనట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News