నేనా...? సీఎం పదవా? మంత్రి పదవే ఎక్కువ

Update: 2016-06-30 07:20 GMT
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు - టీఆరెస్ లో ఆయన ఆధిపత్యానికి ప్రస్తుతానికి ఎదురే లేదని ఎవరిని అడిగినా చెబుతారు. అయితే... భవిష్యత్తంతా ఇలాగే ఉంటుందా? ఎల్లకాలం కేసీఆర్ హవా కొనసాగుతుందా? టీఆరెస్ లో సెకండ్ ప్లేస్ ఎవరిది? కేసీఆర్ కుమారుడు కేటీఆర్ దా? లేదంటే మేనల్లుడు హరీశ్ రావుదా? పార్టీవర్గాల్లోనూ, ప్రజల్లోనూ తరచూ ఇలాంటి చర్చలు జరుగుతుంటాయి. వీటికి సమాధానాలుగా ఎవరికి తోచిన వాదనలు వారు చేస్తుంటారు. సీఎం కేసీఆర్ కు వారసుడెవరన్న విషయంలో చాలాకాలంగా చర్చ నడుస్తోంది. కేసీఆర్ టీఆరెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన్ను అంటిపెట్టుకుని ఉండి కుడి భుజంలా ఉండడమే కాకుండా కేసీఆర్ కు సమాన స్థాయిలో పార్టీ వర్గాలు - ప్రజల్లో పట్టున్న హరీశ్ రావుకే ఆ అర్హత ఉందంటారు కొందరు.. హరీశ్ కంటే ఆలస్యంగా పాలిటిక్సులోకి ఎంటరైనా కొద్దికాలంలోనే కమ్మేసిన కేటీఆర్ కే ఆ అర్హత ఉందంటారు ఇంకొందరు. ఎప్పటికైనా హరీశ్ సీఎం అవుతారన్నది కొందరి అభిప్రాయమైతే, కేటీఆర్ దే ఆ ఛాన్సన్నది మరికొందరి అభిప్రాయం. ఇలాంటి తరుణంలో తాజాగా హరీశ్ ఈ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ త‌రువాత అస‌లు వార‌సుడు ఎవ‌రు? అన్న వాద‌న‌కు తెర‌ దించారు. కేసీఆర్ త‌రువాత సీఎం రేసు మొద‌లైతే.. తాను ఉండ‌బోన‌ని  హ‌రీశ్ రావు పరోక్షంగా స్ప‌ష్టం చేశారు.

హరీశ్ తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరోసారి చర్చకు దారితీస్తున్నాయి. త‌న‌కు మంత్రి ప‌ద‌వే చాలా పెద్ద‌ద‌ని.. ఇంత‌కు మించి ప‌ద‌వి త‌న‌కు రాద‌ని హ‌రీశ్ రావు తేల్చి చెప్పారు. ఉద్య‌మ‌కాలం నుంచి త‌న‌ను ఆద‌రించిన మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల రుణాన్ని ఎప్ప‌టికీ తీర్చుకోలేన‌ని ఆయన అంటున్నారు. హ‌రీశ్ చేసిన వ్యాఖ్య‌లు అటు మీడియాలో.. ఇటు తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి.

ఉద్య‌మ స‌మ‌యం నుంచి హ‌రీశ్ రావు పార్టీ అధినేత‌ - త‌న మేన‌మామ అయిన కేసీఆర్ వార‌సుడిగా పేరుపొందారు.  అసెంబ్లీలో త‌న వాగ్దాటితో మామ‌కు త‌గ్గ అల్లుడ‌ని - మాట‌తీరు - ముక్కుసూటిత‌నంలో మామ‌ను మించిపోయాడ‌ని పార్టీశ్రేణులు - రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులే ఆయ‌న్ను అభినందించేవారు. పార్టీలో నెం.2గా ఎదిగారు. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న ప్ర‌తిసారీ ద‌గ్గ‌రుండి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వ్య‌క్తిగా - ట్ర‌బుల్ షూట‌ర్‌ గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఉద్య‌మంలో కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న స‌మ‌యంలో పార్టీ భారాన్ని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించారు. స‌మైక్య రాష్ట్రంలో 2010 త‌రువాత జ‌రిగిన ప్ర‌తి ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ సాధించిన ప్ర‌తి విజ‌యం వెన‌క హ‌రీశ్‌ రావు ఉన్నాడ‌న్న‌ది నిర్వివాదాంశం.

అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి - టీఆరెస్ అధికారంలోకి వ‌చ్చాక హ‌రీశ్ కు ప్రాధాన్యం త‌గ్గింద‌నే ప్ర‌చారం మొద‌లైంది. పార్టీలో కేసీఆర్ త‌న కుమారుడు కేటీఆర్ కు కొంత ఎక్కువ ప్రాధాన్యం క‌ల్పిస్తున్నాడ‌న్న విమ‌ర్శలు ఊపందుకున్నాయి. వీటికి ఊత‌మిచ్చేలా వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక స‌మ‌యంలో హ‌రీశ్ పరిమితిని త‌గ్గించారు. పాలేరుకు దూరం పెట్టారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎల‌క్ష‌న్‌ లోనూ ప‌క్క‌న‌బెట్టారు. ఒక్క నారాయ‌ణ‌ఖేడ్ ఉప ఎన్నిక‌లో మాత్ర‌మే పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వీటన్నింటిని బేరీజు వేసిన అనంత‌రం పార్టీలో హ‌రీశ్ ప్రాధాన్యం త‌గ్గుతోంద‌ని.. రాజ‌కీయ  విశ్లేష‌కులు - ఆయ‌న అనుచ‌రులు అనుమానించ‌డం మొద‌లు పెట్టారు. మొత్తానికి త‌న జీవితంలోనే ఇదే అతిపెద్ద ప‌ద‌వి అని హరీశ్ చెప్ప‌డంతో సీఎం రేసుపై చెల‌రేగుతున్న ఊహాగానాల‌కు తెర‌దించారు హ‌రీశ్‌.

కానీ... హరీశ్ రాజకీయ ఎత్తుగడలు - ప్రజల్లో ఆయనకున్న ఆదరణ - ఆయన సామర్థ్యాలు తెలిసినవారు మాత్రం హరీశ్ మాటలను తేలిగ్గా తీసుకుంటున్నారు. సమయం - సందర్భం లేనప్పుడు భవిష్యత్తుపై చర్చలెందుకన్న ఉద్దేశంతోనే హరీశ్ ఇలాంటి కామెంట్ చేశారని.. అవకాశం దక్కితే ఆయన పార్టీకి - రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి ఆసక్తిగానే ఉంటారని అంటున్నారు. కేసీఆర్ - కేటీఆర్ లకు కూడా ఇలాంటి అంచనా ఉండొచ్చని.. హరీశ్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గించి ఆయనలో అసంతృప్తి జ్వాలలు రగిలించకుండా.. అదేసమయంలో కేటీఆర్ ను ఆయన డామినేట్ చేయకుండా బ్యాలన్స్ మెంటైన్ చేస్తున్నది అందుకేనని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో ఈ రోజు మాట రేపు ఉండదన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నారు.
Tags:    

Similar News