''గండిపేట'' పై హరీశ్‌ కు ప్రేమ ఎందుకు?

Update: 2015-05-25 06:53 GMT
గండిపేట...హైదరాబాద్‌ శివారులోని ఈ ప్రాంతం అందరికీ సుపరిచితం. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌ కు అత్యంత ఇష్టమైన ప్రాంతం. తెలుగుదేశం పార్టీని స్ఠాపించేందుకు కసరత్తు చేసింది మొదలు...కీలక నిర్ణయాలన్నీ గండిపేట కేంద్రంగానే జరిగాయి. టీడీపీ పండగ అయిన మహానాడు ఇక్కడే నిర్వహిస్తుండటం మనకు తెలిసిందే. అలాంటి గండిపేటకు ప్రాశస్త్యం కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు. టీడీపీ అంటేనే ఇంతెత్తున లేచిపడే హరీశ్‌ రావు... ఈ నిర్ణయం తీసుకోవడంలో మతలబు ఏంటి అనుకుంటున్నారా.. అదే హరీశ్‌  రావు ప్రత్యేకత.

మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణన తన ఇంటి పని అన్నంత అంకితభావంతో మంత్రి హరీశ్‌ రావు ముందుకువెళ్తున్న సంగతి తెలిసిందే. గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల వద్ద సైబరాబాద్‌ పోలీసులు కొత్తగా ఏర్పాటు చేసిన లేక్‌-పోలీసుస్టేషన్‌లను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గండిపేట జలాశయానికి వందేళ్లు నిండిన విషయం హరీశ్‌ దృష్టికి వచ్చింది. మరోవైపు అక్కడి అందాలుచూసి హరీశ్‌ ముచ్చటపడ్డారు. గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలను టూరిజం కేంద్రంగా మార్చనున్నట్లు మంత్రి అక్కడే ప్రకటించారు. వచ్చే ఏడాది గండిపేటకు వందేళ్లు నిండిన నేపథ్యంలో ఉత్స వాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గండిపేట జలాశయాన్ని తాను దత్తత స్వీకరిస్తున్నట్లు, సాగర్‌ జలాశయాన్ని శంషాబాద్‌ డిసీపీ శ్రీనివాస్‌ దత్తత తీసుకుంటునట్లు మంత్రి వివరించారు.

మొత్తంగా అభివృద్ధి చేయడంలో తమకు భేధాబిప్రాయాలు లేవని, హరీశ్‌ రావు మరోమారు నిరూపించుకున్నారు.


Tags:    

Similar News