మామ మాటలకు మేనల్లుడి కొనసాగింపు విన్నారా?

Update: 2016-07-11 14:10 GMT
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమితంగా ఆరాధించే వారిలో ముందువరసలో ఉంటారు ఆయన మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ఉద్యమసమయంలో ఎవరెన్ని వేషాలు వేసినా.. మేనమామకు నమ్మిన బంటుగా నిలిచిన వైనాన్ని ఎవరూ మర్చిపోరు. కాకుంటే.. ఊహించని రీతిలో పొలిటికల్ సీన్లోకి అక్కడెక్కడో అమెరికాలో ఉన్న కేటీఆర్ రావటం.. కేసీఆర్ తర్వాతి స్థానాన్ని అక్యూపై చేయటం వర్తమానంగా చెప్పాలి.

మేనమామ మాటల్ని.. చేతల్ని చాలావరకూ తనదైన స్టైల్లో ఇమిటేట్ చేసే హరీశ్ రావు తాజాగా హరితహారం మీద ముఖ్యమంత్రి ఈ మధ్య చెప్పిన మాటల్ని యథాతధంగా చెప్పటమే కాదు.. దానికి కొనసాగింపుగా తనదైన మాటల్ని చెప్పి అందరి మనసుల్ని దోచుకుంటున్నాడు. హరితహారం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన సందర్భంగా నల్గొండ జిల్లాకు అవసరమైన ప్రాజెక్టు కోసం రూ.330కోట్లను మూడు నిమిషాల్లో ఆమోదించానని.. కానీ.. ఎన్ని కోట్లు కుమ్మరించినా వాన మాత్రం కురవదని.. డబ్బులిస్తే వాన దొరకదని.. అందుకే చెట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతూ.. చెట్లతోనే వర్షం కురుస్తుందన్న మాటను చెప్పుకొచ్చారు.

మేనమామ చెప్పిన మాటల్నే తాజా హరితహారం రెండో దశ సందర్భంగా చెప్పిన హరీశ్.. తన వ్యాఖ్యల్ని మరికొన్నింటిని జోడించారు.  ‘‘వ‌ర్షాలు రావాలన్నా..వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డాలన్నా.. ఉష్ణోగ్ర‌త‌ల్నికంట్రోల్ చేయాలన్నా మన చేతుల్లో లేదు. చెట్లు నాటగలిగితే ఆ పనిని అవే చేస్తాయి. డ‌బ్బులుంటే ఏమైనా కొన‌గ‌లుగుతాం.. వ‌ర్షాలను కొంటామా? మంచి వ‌ర్షాలు ప‌డాలంటే చెట్లు కావాలి. పుట్టినప్పుడు ఊయ‌ల కావాలి. దాన్ని త‌యారు చేయాల‌న్నా చెట్టే కావాలి. చ‌చ్చిన‌ప్పుడు కాల్చ‌డానికీ చెట్టు క‌ట్టే కావాలి’’ అంటూ చెట్ల ప్రాముఖ్యతను చెప్పుకొచ్చారు. మేనమామ చెప్పినంత ముచ్చటగా లేనప్పటికీ.. ఆకట్టుకునేలా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.
Tags:    

Similar News