భారీ ప్రాజెక్టుల్లో ‘మిషన్ కాకతీయ’ మిస్ ఏంటి?

Update: 2016-08-20 05:18 GMT
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో మిషన్ కాకతీయ ఒకటి. తెలంగాణ గ్రామీణ నీటి అవసరాల్ని సమూలంగా మార్చేసే ఈ ప్రాజెక్టు విషయంలో విపక్షాలు కూడా వేలెత్తి చూపించేందుకు కిందామీదా పడిన పరిస్థితి. ఏ మాత్రం అవకాశం చిక్కినా బండకేసి బాదేసినట్లుగా వ్యవహరించే విపక్షాలు మిషన్ కాకతీయ మీద మాత్రం మౌనంగా ఉండటాన్ని మర్చిపోలేం.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో విపక్షాలు ఎంతలా చెలరేగిపోతున్నాయో తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు సంబంధించి.. నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం వ్యవహారంలో ఇన్ని తప్పులు ఎత్తి చూపుతున్న విపక్షాలు మిషన్ కాకతీయలో మాత్రం పెద్దగా గళం విప్పకపోవటం చూస్తేనే.. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కారు ఎంత పక్కాగా చేపడుతుందన్న విషయం అర్థమవుతుంది. అయితే.. ఈ మిషన్ కాకతీయలో తమ వారికే పనులు అప్పజెబుతున్నారన్న ఆరోపణ ఉన్నప్పటికి అదేమీ తెలంగాణ సర్కారును చిరాకుకు గురి చేయలేదు. మిషన్ కాకతీయ విషయంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్న కేసీఆర్ సర్కారు పెద్ద ప్రాజెక్టు టెండర్ల విషయంలో అలా వ్యవహరించకపెవటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మిషన్ కాకతీయ కింద పిలిచిన టెండర్లలో అంచనా విలువలో 30 శాతం లెస్ కు వచ్చిన పరిస్థితి. ఈ కారణంగా మిషన్ కాకతీయ పనుల్లో తెలంగాణ ప్రభుత్వానికి రూ.600 కోట్లు ఆదా అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావే అసెంబ్లీలో చెప్పారు. మరి.. మిషన్ కాకతీయ పనుల్ని ప్రతిపాదిత మొత్తం కంటే తక్కువ మొత్తానికి తీసుకున్న కాంట్రాక్టర్లు.. పెద్ద ప్రాజెక్టు విషయంలో అలా ఎందుకు చేయలేకపోతున్నారన్నది ఒక ప్రశ్న.

చిన్న ప్రాజెక్టుల విషయంలో 30 శాతం తక్కువకు కోట్ చేస్తే మిగిలే మొత్తం కంటే..  పెద్ద ప్రాజెక్టుకు 2 శాతం అదనంగా కోట్ చేయటం వల్ల ప్రభుత్వం మీద పడే భారం చాలా ఎక్కువగా ఉంటుంది. తాజాగా చూస్తే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో 2 శాతం ఎక్కువకు పనుల్ని అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకిలా జరిగిందన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే.. మిషన్ కాకతీయ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కంటే తక్కువ మొత్తానికే పనులు పూర్తి చేయటానికి సిద్ధమైనప్పుడు.. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు లాంటి వాటిల్లో ఎక్సెస్ కు ఎందుకు కోట్ చేయాల్సి వస్తోంది. అందుకు ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారెవరు..? మిషన్ కాకతీయ పనుల్ని తక్కువ మొత్తాలకే పూర్తి చేసిన విషయాన్ని గొప్పగా చెప్పుకున్న మంత్రి హరీశ్.. పెద్ద ప్రాజెక్టుల విషయంలో అందుకు భిన్నంగా ఎందుకు ఉందన్న ప్రశ్నకు ఆయన ఇచ్చే సమాధానం ఏంటి..?
Tags:    

Similar News