ఈ సారీ లోక‌ల్ సెంటిమెంటేనా హ‌రీశ్?

Update: 2018-09-20 07:17 GMT
2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా రెండు ముక్క‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక తెలంగాణ సెంటిమెంట్ ను గౌర‌విస్తున్నామ‌ని చెబుతూ...అశాస్త్రీయంగా ఏపీని కాంగ్రెస్ విడగొట్టింది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో....టీఆర్ ఎస్...తెలంగాణ లోక‌ల్ సెంటిమెంట్ ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి అధికారం చేప‌ట్టింది. ఆంధ్రా నాయ‌కులు ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌ను దోచుకున్నార‌ని....మ‌న రాష్ట్రాన్ని మ‌నం ప‌రిపాలించుకుందామ‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. ఈ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో మ‌ళ్లీ లోక‌ల్ సెంటిమెంట్ ను టీఆర్ ఎస్ పెద్ద‌గా ట‌చ్ చేయ‌లేదు. సీన్ క‌ట్ చేస్తే...ఇపుడు తాజాగా రాబోయే ఎన్నిక‌ల మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్ ను టీఆర్ ఎస్ న‌మ్ముకున్న‌ట్లు క‌నిపిస్తోంది. టీఆర్ ఎస్ మీద వ్య‌తిరేక‌త‌ - 2014లో ఇచ్చిన హామీల‌న్నింటినీ కేసీఆర్ నెర‌వేర్చ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో....రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం...మ‌రోసారి లోక‌ల్ సెంటిమెంట్ తేనెతుట్టెను తెలంగాణ భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్ రావు క‌దిల్చారు.

రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ - జ‌న‌స‌మితి - సీపీఎం ల‌తో కాంగ్రెస్ మ‌హాకూట‌మిని ఏర్ప‌రిచి టీఆర్ ఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పై హ‌రీశ్ ఎదురుదాడికి దిగారు. దేశంలోనే అతి పురాత‌న పార్టీ కాంగ్రెస్...తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని - అటువంటి కాంగ్రెస్ కు ఓటెందుకు వేయాల‌ని హ‌రీశ్ ప్ర‌శ్నించారు. పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించిన కాంగ్రెస్...ప్రాణహిత‌కు మాత్రం మొండిచెయ్యి చూపింద‌న్నారు. ఏపీకి హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ హామీ ఇచ్చింద‌ని, అదే జ‌రిగితే....తెలంగాణ‌లో ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి త‌ర‌లిపోతాయ‌ని,. ఇక్క‌డ ఉపాధి అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని అన్నారు. తెలంగాణ‌లో మ‌హా కూట‌మి ఏర్ప‌డింది అధికారం కోస‌మేన‌ని....తెలంగాణ అభివృద్ధి కోసం కాద‌ని అన్నారు.

అయితే, హ‌రీశ్ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ‌ను ఇచ్చింది కాంగ్రెస్ అన్న సంగ‌తి హ‌రీశ్ మ‌ర‌చిపోయార‌ని...నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏరు దాటాక తెప్ప త‌గ‌లేయ‌డం అంటే ఇదేన‌ని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ మాట త‌ప్పార‌ని కామెంట్స్ పెడుతున్నారు. తెలంగాణ ఇవ్వ‌క‌ముందు ఢిల్లీకి చ‌క్క‌ర్లు కొట్టిన హ‌రీశ్...ఇప్పుడు ఆ విష‌యం మ‌రచిపోయారని అంటున్నారు. నాలుగేళ్లుగా గుర్తుకురాని లోక‌ల్ సెంటిమెంట్....స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు గుర్తుకు వ‌చ్చింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజ‌కీయాల‌లో గెలుపోట‌ములు స‌హ‌జ‌మ‌ని...కానీ టీఆర్ ఎస్ గెలుపు కోసం....మ‌రోసారి ఆంధ్ర‌, తెలంగాణ‌...ల మ‌ధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని అనుకుంటున్నారు.
Tags:    

Similar News