తన గెలుపును మీడియాకు చెప్పిన రావత్

Update: 2016-05-10 09:53 GMT
గత కొద్దిరోజులుగా నాటకీయ మలుపులు తిరుగుతున్న ఉత్తరాఖండ్ రాజకీయం ముగింపు దశకు చేరుకుంది. తొమ్మిది మంది జంపింగ్ ఎమ్మెల్యేలతో ఉత్తరాఖండ్ లోని కాంగ్రెస్ నేతృత్వంలోని హరీశ్ రావత్ ప్రభుత్వానికి నీళ్లు తీసుకురావటం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో స్పీకర్.. కోర్టులు తీసుకున్న నిర్ణయాలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

జంపింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని ఓకే అంటూ.. రావత్ ప్రభుత్వానికి నిర్వహించాల్సిన బలపరీక్షలో సదరు ఎమ్మెల్యేలు పాల్గొనకుండా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవటం.. ఈ ఉదయం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించటం చకచకా జరిగిపోయాయి. బలపరీక్షలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇచ్చిన తోడ్పాటుతో పాటు.. ఇండిపెండెంట్లు సహకారంతో రావత్ ప్రభుత్వం గట్టెక్కిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

బలపరీక్ష పూర్తి అయిన తర్వాత.. ఫలితాన్ని రికార్డు చేసి సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు అందజేయాల్సి ఉన్న నేపథ్యంలో ఫలితాన్ని ప్రకటించలేదు. అయితే.. బలపరీక్షలో ఏం జరిగిందన్న విషయాన్ని హరీశ్ రావత్ తాజాగా వెల్లడించారు. తమకు 34 ఓట్లురాగా.. విపక్ష బీజేపీకి 28 ఓట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. తాజా ఫలితం నేపథ్యంలో హరీశ్ రావత్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని చెప్పొచ్చు.
Tags:    

Similar News