ఇద్దరు గుజరాతీలు చాలు... చక్రం తిప్పేస్తారు...?

Update: 2022-08-30 12:30 GMT
ఏమిటో ఈ దేశంలో కులం, మతం కంటే భావోద్వేగమైన విషయాలు లేవు అంటారు. కానీ వాటితో పాటు ప్రాంతాలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అంతా ఒక్కటే. మనం భారతీయులమని అనుకుంటారు కానీ ఎవరికి వారిగా చూస్తే ఈ ప్రాంతీయ అభిమానం చాలానే ఉంటుంది. అయితే ఇది హద్దులు దాటరాదు. కానీ రాజకీయం అడుగుపెట్టిన చోట ఈ అభిమానాలు దురభిమానాలుగా మారిపోతున్నాయి.

ఇక ఈ దేశాన్ని ఎందరో ఏలారు. ఎక్కువసార్లు ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధానులు వచ్చారు. ఇక సంయుక్త మహారాష్ట్రలో పుట్టినా కూడా  గుజరాతీగానే మొరార్జీ దేశాయ్ ఈ దేశ ప్రధాని పదవి అందుకున్నారు. అయితే ఆనాడు కూడా ఎవరూ గుజరాతీ రాజ్ అని అనలేదు. కానీ గత ఎనిమిదేళ్లుగా మాత్రం గుజరాత్ పేరు మారుమోగుతోంది. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయం. ఈ ఇద్దరూ గుజరాతీలు కావడమే కాదు, దేశం మొత్తంగా అని ఆలోచించకుండా కాస్తా సంకుచితంగా ఆలోచిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా గుజరాత్ కే తీసుకెళ్తున్నారు అన్న విమర్శలూ ఉన్నాయి.  ఒక విధంగా గుజరాతీల పట్ల దేశానికి ఉత్తమమైన అభిప్రాయం ఉన్నా కూడా కేవలం రాజకీయ పరమైన కారణాల వల్ల కొందరు గుజరాతీలను చూసి అసూయ చెందే పరిస్థితి దేశానికి అనవసరమైనదిగా  వస్తోంది. దానికి కారణం ఏలిన వారి నిర్వాకం అని చెప్పుకోవాలి.

ఇదిలా ఉంటే ఇద్దరు గుజరాతీలు ఉంటే చాలు చక్రం తిప్పేస్తారు అన్నట్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా చేసిన ట్వీట్  ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన అన్న మాటలు చూస్తే చాలా విషయాలను మేనేజ్ చేయడానికి ఇద్దరు గుజరాతీలు సరిపోతారు అని. అలా రాజకీయాల్లో మోడీ అమిత్ షా. బిజినెస్ లో అంబానీ, ఆదానీ, క్రికెట్ ఫీల్డ్ లో జడేజా పాండ్యా అని ట్వీట్ చేసి గోయెంక నెటిజన్లకు  మంట పెట్టేశారు.

దీంతో నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇన్ని చెప్పిన తమరు మార్వాడీనా సారూ అంటూ గోయెంకాను ఆటపట్టిస్తున్నారు. నిజానికి ఆయన దేశం కీర్తి మొత్తం ఒక ప్రాంతానికి కొందరికే అంటకట్టే ప్రయత్నం తనకు తెలిసో తెలియకనో ఒక్క ట్వీట్ ద్వారా చేయడమే నెటిజన్లకు మండించేలా చేస్తోంది. రాజకీయం అయినా బిజినెస్ అయినా క్రికెట్ అయినా ఏ ఒక్కరి వల్లనో సక్సెస్ ఫుల్ గా సాగదు. అందరూ ఉండాలి. అందరి వాటా కావాలి.

మరి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న గోయెంకా ఈ సింపుల్ లాజిక్ మిస్ అయ్యారా లేక గుజరాతీల మీద అవ్యాజమైన ప్రేమ ఇలా చూపించాలనుకున్నారా ఏమో ఏ ఇతర కారణాలో కూడా అసలు  తెలియదు  కానీ ఆఖరుకు యువత సహా టోటల్ జనాభాకు హట్ ఫేవరేట్ అయిన  క్రికెట్ ఫీల్డ్ కి కూడా ఈ ప్రాంతీయ దురభిమానాన్ని అంటకట్టి  క్రికెట్ మీద కూడా మచ్చ పడేలా చేశారు అంటున్నారు. మరి దీనికి గోయెంకా సార్ ఏ రకమైన బదులు ఇస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News