మళ్లీ ఇండియన్ మిస్ వరల్డ్

Update: 2017-11-18 15:21 GMT
చాలాకాలం తరువాత భారతదేశానికి ప్రపంచ సుందరి కిరీటం దక్కింది. 16 ఏళ్ల విరామం తరువాత భారతీయ వనిత ప్రపంచ సుందరి అయ్యింది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ అయిన తరువాత ఇప్పటి వరకు మళ్లీ ఎవరూ మన దేశం నుంచి ఆ కిరీటం అందుకోలేకపోయారు. తాజాగా హర్యాణాకు చెందిన మానుషి ఛిల్లర్ మళ్లీ భారత్ కు ఆ కిరిటాన్ని తీసుకొస్తున్నారు.

108 దేశాలకు చెందిన అమ్మాయిలతో పోటీ పడిన 20 ఏళ్ల చిల్లర్ తన అందం, తెలివితేటలతో మెప్పించి ఈ క్రేజీ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గత ఏడాది మిస్ వరల్డ్ గా ఎంపికైన ఫ్యుర్టోరికా సుందరి స్టెఫానీ నుంచి చిల్లర్ ఈ కిరీటం అందుకున్నారు.

చిల్లర్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూలులో చదువుకున్న చిల్లర్ ఆ తరువాత సోనేపట్ లోని భగత్ ఫూల్ సింగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిసన్ చదివారు. మిస్ వరల్డ్ పోటీల ఫైనల్స్ లో ఆమెను ‘‘ఏ ప్రొఫెషన్‌కు అత్యధిక జీతం, గౌరవం ఇవ్వొచ్చు’’ అని అడగ్గా ఆమె ‘‘అమ్మకు అత్యంత గౌరవం ఇవ్వాలి.. అయితే, ఆమెకు డబ్బుతో ముడిపెట్టలేం, ప్రేమ, గౌరవాలు అందించాలి’’ అని చెప్పారు.

కాగా చిల్లర్ కంటే ముందు భారత్ నుంచి 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 1999లో యుక్తా ముఖి, 1997లో డయానా హెడెన్, 1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయ్యారు. 1994 నుంచి 2000 మధ్య ఆరుగురు మిస్ వరల్డ్ అయినా ప్రియాంక చోప్రా తరువాత మళ్లీ ఇంతవరకు ఎవరూ కాలేకపోయారు. తాజాగా చైనాలో జరిగినపోటీలో మళ్లీ ఇండియాకు ఆ కిరీటం దక్కడం విశేషం.
Tags:    

Similar News