రేప్ చేయలేదు కానీ.. నగలు కొట్టేశారట

Update: 2016-02-26 04:12 GMT
తమ డిమాండ్ల సాధన కోసం జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారటం.. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరాచకానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆందోళన పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి రవాణా సౌకర్యాలు మొత్తాన్ని స్థంభింపచేసిన ఆందోళనకారులకు సంబంధించిన ఒక సంచలన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆందోళన జరిపిన సమయంలో హర్యానాలోని సోనిపట్ ప్రాంతం వద్ద కొందరు మహిళలపై ఆందోళనకారులు సామూహిక అత్యాచారం జరిపిన ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఫిబ్రవరి 20 వరకు అత్యాచారాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారటం.. రహదారుల మీద పెద్ద ఎత్తున వాహనాలు నిలిపేసిన సందర్భంగా పలువురు మహిళలపై ఆందోళనకారుల ముసుగులో కొందరు ఆరాచక వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్త రాయటం సంచలనం రేకెత్తించింది. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అధికారులు.. ఇలాంటివేమీ చోటు చేసుకోలేదని.. మహిళలపై అత్యాచారాలు జరగలేదు కానీ.. వారి మెళ్లో చైన్లు.. నగల్ని కొట్టేశారని చెబుతున్నారు. అత్యాచారాలు జరగలేదని చెబుతున్నా.. నగలు లూటీ చేయటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News