హ‌మ్మ‌య్యా!... ట్విట్ట‌ర్ ను ర‌మ్య వీడింద‌బ్బా!

Update: 2019-06-02 08:11 GMT
గ్రాండ్‌ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా చీఫ్ గా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ఆ పార్టీ మాజీ ఎంపీ ర‌మ్య అలియాస్ దివ్య స్పంద‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిత్యం సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్ గా ఉండే ర‌మ్య‌.... ఏకంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాను తొల‌గించేశారు. ప్రస్తుతం ఆమె ట్విట్ట‌ర్ ఖాతాలో ఆమె క‌నిపించ‌డం లేదు. ఆమె ఖాతాలో ట్వీట్లు గానీ, రీట్వీట్లు గానీ లోడ్ కావ‌డం లేదు. నిత్యం వివాదాస్ప‌ద ట్వీట్ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న ర‌మ్య‌... నెటిజ‌న్లు కొట్టిన దెబ్బ‌కే ట్విట్ట‌ర్ నుంచి గాయ‌బ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప‌రిణామం ఓ మోస్త‌రు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నా... అస‌లే ఓట‌మి బాధలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కాస్తంత ఊర‌టేన‌ని చెప్పాలి. ఎందుకంటే... అస‌లు తాను ఏం చెప్ప‌ద‌లచున్నాన‌న్న విష‌యాన్ని సూటిగా చెప్ప‌కుండా డొంక‌తిరుగుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌మ్య కార‌ణంగా పార్టీ ప‌లుమార్లు ఇబ్బందులు ప‌డింది. తాజాగా ర‌మ్య ట్విట్ట‌ర్ నుంచి ఎగ్జిట్ ఇచ్చిన నేప‌థ్యంలో ఆ పార్టీకి ఊర‌ట కాక మ‌రేమిటి?

స‌రే.. అస‌లు ర‌మ్య ట్విట్ట‌ర్ నుంచి ఎగ్జిట్ ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌న్న వియానికి వ‌స్తే... రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లచే తీవ్ర విమర్శల పాలైన విషయం విధితమే. ఆ కామెంట్లకు తట్టుకోలేకనే ఆమె ట్విటర్‌ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఆమెను ట్విటర్‌లో 8లక్షలకు పైగా ఫోలోవర్స్‌ ఉన్నారు. కేబినెట్‌లో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్‌.. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. దీనిపై నిర్మలకు ప్రశంసలు అందుతున్నాయి. రమ్య కూడా నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు.. *1970లో ఇందిరా గాంధీజీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహిళలను గర్వపడేలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆ శాఖను చేపట్టినందుకు అభినందనలు. కానీ జీడీపీ అంత గొప్పగా ఏమీ లేదు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా తప్పక కృషి చేస్తారని తెలుసు. మీకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది. శుభాకాంక్షలు* అని రమ్య ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో రమ్య ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. దేశ తొలి ఆర్థిక మంత్రి అని నిర్మలా సీతారామన్‌ను పిలవడం కాంగ్రెస్‌ వాళ్లకు ఇష్టం ఉండదేమో అని విమర్శలు గుప్పిస్తున్నారు. *మేడమ్‌.. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉండి, ఆర్థిక శాఖను తన వద్ద పెట్టుకున్నారు. కానీ నిర్మలాజీపై నమ్మకంతో ప్రధాని ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబట్టి తొలి ఆర్థిక మహిళా మంత్రిగా ఆమెను పరిగణించాలి. ఇక జీడీపీ అంటారా. మీ దృష్టిలో జీడీపీ అంటే గాంధీ డైనస్టీ పాలిటిక్స్‌ అనుకుంటా. ఎందుకంటే మీకు ఆ పదానికి వివరణ, అర్థం తెలియదు కదా. అభినందించే క్రమంలో ఇలా రాజకీయాలు చేయడం, ప్రజలను పక్కదారి పట్టించడం సరైంది కాదు* అంటూ విపరితంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఈ వ‌రుస దెబ్బ‌ల‌కు ర‌మ్య ట్విట్ట‌ర్ నుంచి నిష్క్ర‌మించ‌క త‌ప్ప‌లేదు.


Tags:    

Similar News