నో ప్రతిపక్షం.. అంతా స్వపక్షం

Update: 2018-12-22 04:34 GMT
తెలంగాణలో ప్రతిపక్షం లేదు. కాదు... కాదు.. లేకుండా పోయింది. ఇలా ఎవరు చేశారు. రాజకీయ నాయకులో... అధికార పక్షమో.... ముఖ్యమంత్రో.... నలుగురైదురుగు నాయకులో... అనుకుంటున్నారా.. కాదు . కానే కాదు. ఇలా చేసింది ప్రజలే. అవును.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసింది ప్రజలే. తెలంగాణ ఏలికకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని లేకుండా చేయాలని ఏకం అయ్యాయి. అంతే కాదు.... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉనికినే ప్రశ్నించారు. ఇందుకోసం దశాబ్దాల వైరాన్ని సైతం పక్కన పెట్టారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఏకమవడాన్ని ఆయా పార్టీలకు చెందిన నాయకులు అంగీకరించారేమో కాని... తెలంగాణ ప్రజలు మాత్రం అంగీకరించలేదు. అందుకే వారిద్దరి స్నేహాన్ని ఆదిలోనే తుంచేశారు.  

తెలంగాణలో 119 స్ధానాలకు ఎన్నికలు జరిగితే అందులో 88 స్ధానాలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వశమయ్యాయి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని తెలంగాణలో పర్యటించారు. ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో తీవ్ర ప్రచారం చేశారు. అయితే ఆయన ప్రచారాన్ని ఆయన సొంత రాష్ట్రం వారిగా భావిస్తున్న వారే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కూటమిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిణామం రెండు పార్టీలకు మింగుడు పడలేదు. ఇక ఎన్నికల అనంతర పరిణామాలు చూస్తే రాష్ట్రంలో ఇక ప్రతిపక్షం లేనట్లుగానే కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు స్వతంత్రులు ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు.

ఇక ప్రతిపక్షాలకు చెందిన మిగిలిన శాసనసభ్యుల్లో దాదాపు పది మంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారని అంటున్నారు. మరోవైపు శాసన మండలిలో ఉన్న ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల్లో నలుగురు తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమవుతున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిని మండలి చైర్మన్ అధికారికంగా గుర్తించారు. ఇక మిగిలిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీల పదవీ కాలం రెండు నెలల్లో ముగుస్తుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో శాసనమండలిలో అన్ని స్ధానాలు తెలంగాణ రాష్ట్ర సమితివే. ఇలా అటు శాసనసభలోనూ, ఇటు శాసన మండలిలోనూ కూడా ప్రతిపక్షమే లేకుండా పోయింది. ఇది మంచా... చెడా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే అధికార పార్టీ హవా ఒక్కటే తెలంగాణలో వీస్తున్నది.

Tags:    

Similar News