గవర్నరు పదవిపై ఆశే ఆయన్ను నడిపిస్తోంది

Update: 2019-03-03 11:06 GMT
2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీవచ్ఛవమైంది. ఇది జరిగి అయిదేళ్లవుతున్నా ఆ పార్టీ ఇంకా అదే దశలో ఉంది. కొందరు నేతలు అప్పుడే తట్టాబుట్టా సర్దుకుని ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా మరికొందరు ఈ అయిదేళ్లు మౌనముద్రలోకి వెళ్లి ఇప్పుడు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. కొందరు ఇంకా సుప్తావస్థలోనే ఉన్నారు. వారు కాంగ్రెస్‌ లో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. పార్టీ అధినేత వచ్చినా, పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా వారికి సంబంధమే లేదన్నట్లుగా ఉంది. కానీ, ఒక్క నేత మాత్రం అంతా తానే అయి పార్టీని ఇంకా మంచం మీదైనా బతికుండేలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయనే ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి. మరి.. ఏమాత్రం బతుకు ఆశలేని పార్టీని ఆయన ఎందుకు భుజం మీద మోస్తున్నారంటే దానికి కాంగ్రెస్ వర్గాల నుంచే సమాధానం వినిపిస్తోంది. పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమో లేదంటే.. పార్టీ మళ్లీ ఒక వేళ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అయిపోతాననో ఆయనకు ఆశేమీ లేదని.. ఆయన లక్ష్యం వేరని చెబుతున్నారు.
    
అందరూ వదిలేసినా రఘువీరా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నడిపిస్తుండడానికి కారణం గవర్నరు పదవి కావాలని ఆయన ఆశిస్తుండడమేనని చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ అద్భుతాలు చేస్తుందని.. మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయనేమీ నమ్మడం లేదని.. కానీ, కాలం కలిసొచ్చి కేంద్రంలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే తాను గవర్నరు పదవి అందుకోవాలని ఆయన ఆశిస్తున్నారట.
    
పార్టీని కష్టకాలంలో నడిపించినందుకు గాను తనకు ఆ అవకాశం రావొచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారట. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినా ఆయన ఆశలో అర్థం ఉందని నమ్మొచ్చు. కాంగ్రెస్ పార్టీ తన విశ్వాసపాత్రులుకు ఎప్పుడూ న్యాయం చేసింది. ఆ లెక్క ప్రకారమే రఘువీరా గవర్నరుగిరీపై ఆశపడుతున్నారట.
    
రాష్ట్రంలో పార్టీ పూర్తిగా నాశనమైనా కూడా కేంద్రంలో ఈసారి కానున్నా వచ్చేసారైనా కాంగ్రెస్ వస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అందుకు కారణం జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి కొన్నాళ్లు బీజేపీ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఏదో ఒక రోజు కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశం ఇవ్వకమానరు. అప్పుడు పార్టీ తన ఆశను నెరవేరుస్తుందని రఘువీరా భావిస్తున్నారట.
Tags:    

Similar News