హైకోర్టు మ‌ళ్లీ మొట్టికాయ వేసిందా?

Update: 2016-08-11 09:39 GMT
కొన్నిసార్లు అంతే. త‌ప్పు జ‌రిగిన అంశంలోనే మ‌ళ్లీ మ‌ళ్లీ త‌ప్పులు దొర్లుతుంటాయి. పొర‌పాటు జ‌రిగింద‌న్న కంగారులో మ‌రిన్ని పొర‌పాట్లు చేసే వైనానికి త‌గ్గ‌ట్లే తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు మ‌ళ్లీ త‌ప్ప‌ట‌డుగు వేసిందా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. తాను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు ముంపు బాధితుల‌కు ప‌రిహారం అందించేందుకు జీవో 123 విడుద‌ల చేయ‌టం తెలిసిందే. దీనికిసంబంధించి ఇప్ప‌టికే ఒక‌సారి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తిన్న తెలంగాణ స‌ర్కారు ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం ఇచ్చిన తీర్పును ప్ర‌శ్నిస్తూ.. డివిజ‌న్ బెంచ్‌కు అప్పీలు చేసుకోవ‌టం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ర‌ద్దు చేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేయ‌టం తెలిసిందే.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి నిర్వాసితుల అభ్యంత‌రాల‌తో పాటు ప్ర‌భుత్వం అందించే ప‌రిహారానికి సంబంధించిన మొత్తం వివ‌రాల‌తో గురువారం కోర్టుకు హాజ‌రు కావాలంటూ చెబుతూ వాయిదా వేసింది. తాజాగా ఈ అంశంపై హైకోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం అందించిన వివ‌రాల‌పై  హైకోర్టు ధ‌ర్మాస‌నం తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు భూసేక‌ర‌ణ‌కు సంబంధించి జారీ చేసిన జీవోలో అస‌లు స్ప‌ష్ట‌తేలేద‌ని ఆగ్ర‌హించిన కోర్టు..  ఆగ‌స్టు 16న జ‌రిగే త‌దుప‌రి విచార‌ణ‌కు పూర్తి స‌మాచారంతో రావాలంటూ ఏజీని ఆదేశించింది. ఇప్ప‌టికే జీవో 123పై మొట్టికాయ ప‌డిన వేళ‌.. హైకోర్టు ధ‌ర్మాస‌నం పుణ్య‌మా అని చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్లుగా ఉన్న ప్ర‌భుత్వం.. విచార‌ణ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి?కానీ.. అలాంటిదేమీ లేకుండా  అస‌మ‌గ్ర స‌మాచారంతో కోర్టుకు వెళ్లి తెలంగాణ ప్ర‌భుత్వ ప‌ర‌ప‌తిని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. హైకోర్టు నుంచి త‌ర‌చూ ప్ర‌భుత్వానికి ఇలాంటి షాకులు ఎందుకు త‌గులుతున్నాయ‌న్న అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక స‌మ‌గ్ర స‌మీక్ష జ‌రిపితే బాగుంటుంద‌న్న సూచ‌నను అధికార‌పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు లోగుట్టుగా వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News