ఏపీని పిడుగులు ప‌గ‌బ‌ట్టాయా?

Update: 2018-05-03 04:57 GMT
ఎప్పుడూ లేని విధంగా పిడుగుల వ‌ర్షం ఏపీ మీద ప‌డుతోంది. కేవ‌లం ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలో ఏపీ వ్యాప్తంగా ప‌డిన పిడుగుల లెక్క ఇప్పుడు షాకింగ్ గా మారింది. క‌ళ్లు బైర్లు క‌మ్మి.. చెవులు చిల్లులు ప‌డేలా.. ఒక్క‌రే ఉంటే వ‌ణికిపోయేలా చేసిన ఈ పిడుగుల వ‌ర్షం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఏపీకి ప‌క్క‌నే ఉన్న త‌మిళ‌నాడులోని కానీ.. ఇటు తెలంగాణ‌లో కానీ ఈ పిడుగుల హ‌డావుడి క‌నిపించ‌క‌పోవ‌టం ఒక విశేష‌మైతే.. ఏపీ పైనే ప్ర‌కృతి ఇన్నేసి పిడుగుల్ని కురిపిస్తుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

నిపుణుల అంచ‌నా ప్ర‌కారం.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఇన్నేసి పిడుగులు ప‌డ‌టం ఇప్పుడే చూడ‌టంగా చెబుతున్నారు.  మార్చి 16 నుంచి మే 1 వ‌ర‌కూ ఏపీలో ప‌డిన పిడుగులు 1.41ల‌క్ష‌లుగా లెక్క క‌ట్టారు. ఇక‌.. మంగ‌ళ‌వారం (మే1) ఒక్క రోజులోనే ఏపీ వ్యాప్తంగా 41,025 పిడుగులు ప‌డిన‌ట్లుగా అంచ‌నా వేశారు. ఈ పిడుగులు 39 నిండు ప్రాణాల్ని తీసిన‌ట్లుగా అధికారులు లెక్క తేల్చారు. గ‌డిచిన ఆరు నెల‌ల్లో ఏపీ మీద 2.62ల‌క్ష‌ల పిడుగులు ప‌డితే.. కేవ‌లం ప‌దిహేను రోజుల్లోనే అందులో స‌గం కంటే ఎక్కువ పిడుగులు ప‌డ‌టం గ‌మ‌నార్హం. మ‌ర‌ణాల విష‌యంలోనూ అధికారుల దృష్టికి రానివి ఎక్కువే ఉంటాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎందుకు ఇన్నేసి పిడుగులు ప‌డుతున్నాయి? అన్న సూటి ప్ర‌శ్న‌కు ఎవ‌రూసంతృప్తిక‌ర రీతిలో స‌మాధానం చెప్ప‌టం లేదు.  కొంద‌రి నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం  వేస‌విలో స‌ముద్రం నుంచి వ‌చ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశంలో ద‌ట్ట‌మైన క్యుములో నింబ‌స్ మేఘాలు అలుముకుంటాయ‌ని.. ఈ సంద‌ర్భంగా ఉరుములు.. మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతుంద‌ని.. ఈ సంద‌ర్భంగా పిడుగులు ప‌డుతుంటాయ‌ని చెబుతున్నారు. తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త కార‌ణంగా పిడుగులు ప‌డ‌టానికి అర‌గంట ముందే అవి ప‌డే ప్ర‌దేశాన్ని గుర్తించే వీలుంది. దీంతో.. పిడుగులు ప‌డే ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్ల‌కు ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల్ని మెసేజ్ రూపంలో పంపుతున్నారు.

పిడుగులు ప‌డే వేళ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న విష‌యానికి వ‌స్తే..

+ ద‌ట్ట‌మైన మ‌బ్బులు క‌మ్మి భారీ వ‌ర్షం ప‌డే సూచ‌న‌లు ఉన్న‌ప్పుడు.. ఉరుములు పెద్ద ఎత్తున ఉరుముతున్న వేళ‌..  పెద్ద భ‌వ‌నాల్లో ఉండ‌టం మంచిది.

+ ఉరుములు.. మెరుపులు.. గాలివాన‌ల స‌మ‌యంలో టూవీల‌ర్స్ న‌డ‌ప‌రాదు

+ పిడుగులు ప‌డే వేళ‌లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఫోన్లు వాడ‌కూడ‌దు

+ ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ చెట్ల కింద నిలుచోకూడ‌దు

+ ఉరుములు.. మెరుపులు.. పిడుగులు ప‌డే స‌మ‌యంలో ఇంటి త‌లుపులు.. కిటికీలు మూసేసి ఉంచ‌టం ఉత్త‌మం.
Tags:    

Similar News