భద్రాచలం రామయ్య కల్యాణానికి హెలీకాప్టర్

Update: 2020-03-12 15:30 GMT
తెలంగాణ ప్రభుత్వం విమానాయానికి పెద్ద పీట వేస్తోంది. స్థానికులకు ఆర్థిక భారంగా ఉన్న విమానయానాన్ని చేరువ చేస్తోంది. ప్రత్యేక చర్యలు చేపట్టి తక్కువ ఖర్చుతో విహంగం లో విహరించే అవకాశం కల్పిస్తోంది. గతంలో మేడారం సమ్మక్క-సారక్క, జాతర, వేములవాడ లో శివరాత్రి ఉత్సవాలు, హైదరాబాద్ లో హెలీ టూరిజం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దానికి అద్భుత స్పందన వచ్చింది. ప్రజలు హెలీకాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ జీవితం లో కూడా ఆకాశంలో ప్రయాణం చేసినట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా భద్రాచలం లో కూడా హెలీకాప్టర్ సేవలు వినియోగించుకుంటామని తెలంగాణ మంత్రి ప్రకటించారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం శాసనమండలి లో చర్చ సాగింది. ఈ సమావేశాల్లో పలు అంశాలపై సమాధానాలు చెబుతూ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో ఉన్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించారని గుర్తుచేస్తూ తమ ప్రభుత్వం వచ్చాక అద్భుత ప్రగతి పర్యాటక రంగంలో సాధించామని వివరించారు. అందులో భాగంగానే, మేడారం, బోగత, సోమశిల, తాడ్వాయి, నాగార్జున సాగర్ వద్ద కాటేజ్‌ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. వీటితో పాటు ఇటీవల మేడారం, వేములవాడలకు జాతరల సందర్భంగా హెలీకాప్టర్ సేవలు అందించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు అదే మాదిరిగా ఖమ్మం జిల్లాలో జరిగే భద్రాచలం రాముడి కల్యాణం దేశవ్యాప్తంగా పేరు మోసింది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భద్రాచలం రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినతి మేరకు త్వరలోనే భద్రాచలం లో హెలీకాప్టర్ సేవలు అందించే అవకాశం ఉంది.
Tags:    

Similar News