పనామా పేపర్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్

Update: 2016-05-11 08:27 GMT
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కారణంగా పలువురు పెద్ద తలకాయలకు ఎలాంటి తిప్పలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పాల్సిన

అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల భారీ అవినీతి జరిగినా.. హింసా కాండ జరిగినా తెలుగు ప్రాంతాల లింకు ఎంతోకొంత ఉంటుందన్న మాటకు తగ్గట్లే పనామా పేపర్ల ఉదంతంలోనూ కొందరి తెలుగువారి ప్రస్తావన రావటం.. వారెవరూ పెద్ద ప్రముఖులు కాకపోవటంతో పెద్ద రచ్చ జరగలేదు. తాజాగా ఆ కొరత తీరుస్తూ.. పనామా పేపర్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వర ప్రసాద్ పేరు బయటకు రావటం రాజకీయ సంచలనంగా మారింది.

పన్ను ఎగవేత ఆదాయాన్ని గుట్టుగా విదేశాలకు తరలించి.. అక్కడి కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న వైనంలో బాబు కుటుంబ కంపెనీలో పని చేసే డైరెక్టర్ పేరు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పనామా పేపర్లలో ప్రసాద్ పేరు ఉందన్న విషయాన్ని ఒక ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్.. బాలీవార్డ్ లిమిటెడ్.. బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో ప్రసాద్ కు సంబంధం ఉందని.. ఆయన పేరు పనామా పేపర్లలో మూడుసార్లు ప్రస్తావించారని సదరు కథనం చెబుతోంది.

అదే విధంగా ప్రసాద్ కుమారుడు సునీల్ సైతం బిట్ కెమీ వెంచర్స్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా పనామా పేపర్లు వెల్లడిస్తున్నాయి. ప్రసాద్ కుమారుడు సునీల్ అమెరికా.. హైదరాబాద్ లలోని స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు. పనామా పేపర్లలో ప్రస్తావనకు వచ్చిన ప్రసాద్ కు అమెరికాతో పాటు ఘనా.. టోగో దేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నట్లు చెబుతున్నారు. తాజా కథనం తెలుగు తమ్ముళ్లను ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన మొత్తం వివరాలు ఇంకా బయటకు రాకపోవటంతో రచ్చ మొదలు కాలేదు కానీ.. రానున్నరోజుల్లో ఈ వ్యవహారం బాబును ఇరుకున పడేసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరో వైపు  ఊహించని వివాదం తెర మీదకు వచ్చినప్పుడు గుట్టుగా దాన్ని దాచేయటం ఒక పద్ధతి. తమ మీద వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చి.. తామేం చేయనున్నామన్న విషయాన్ని వెల్లడించటం మరో పద్ధతి. తాజాగా పనామాపేపర్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ ప్రసాద్ పేరు రావటం.. ఇది తీవ్ర దుమారంగా మారుతున్న సమయంలో ఆయన స్పందించారు. తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాను 30 ఏళ్లుగా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నానని.. బ్రిటీష్ వర్జిన్ దీవుల్లోకూడా వ్యాపారాలు చేస్తున్నట్లు వెల్లడించారు. పనామాపేపర్ల జాబితా గురించి తనకు తెలియదని.. తన పేరుకు సంబంధించిన అంశాల్ని తన లాయర్లు చూసుకుంటారని స్పష్టం చేశారు.

తాను చేసే వ్యాపారాలన్నీ చట్టబద్ధంగా చేస్తున్నవేనని చెబుతున్న ఆయన.. తనపై తాజాగా వచ్చిన ఆరోపణల విషయంలో తమ లాయర్లు  ప్రొసీజర్ ప్రకారం స్పందిస్తారని చెబుతున్నారు. మరి.. ప్రసాద్ చెప్పిన సమాధానికి బాబు రాజకీయ ప్రత్యర్థులు సంతృప్తి చెందుతారో? లేదో? చూడాలి. ఫారిన్ ట్రిప్ లో ఉన్న చంద్రబాబు అండ్ ఫ్యామిలీకి తాజా ఉదంతం ఇబ్బందికరంగా మారుతుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News