బాబుకు శివాజీ స్ట్రాంగ్ వార్నింగ్

Update: 2016-09-07 06:53 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ఇటీవ‌లి కాలంలో ఓ రేంజ్‌ లో రెచ్చిపోతున్న టాలీవుడ్ న‌టుడు - ప్రత్యేక హోదా సాధన సమితి గౌరవాధ్యక్షుడు శివాజీ మ‌రోసారి త‌న స్టైల్‌ లో రెచ్చిపోయారు. హోదా గురించి ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ.. వార్త‌ల్లో ఉంటున్న శివాజీ.. ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుకు పొలిటిక‌ల్ పొత్తుకు సంబంధించి స‌ల‌హా కూడా ఇచ్చారు. కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే ఇక‌పై టీడీపీకి ఒరిగేది ఏమీలేద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఒకింత సీరియ‌స్ కామెంట్లే చేశారు. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌న‌ని క‌రాఖండీగా చెబుతున్న బీజేపీతో అంట‌కాగితే.. టీడీపీకి చిప్పే గ‌తి అవుతుంద‌ని అన్నారు. విశాఖ‌కు రైల్వే జోన్ ఇవ్వ‌మంటే.. విజ‌య‌వాడ‌కు ఇస్తామ‌ని చెబుతున్నార‌ని, దీనివ‌ల్ల కూడా రాష్ట్రంలో గొడ‌వ‌లు ఖాయ‌మ‌ని అన్నారు.

రానున్న మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో టీడీపీకి చిప్ప చేతికొస్తుందని ఆయన చెప్పారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని మార్చుకోకుండా ఏపీకి కేవ‌లం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకొంటే ఒరిగేదీ ఏమీ ఉండ‌ద‌ని అన్నారు. దీనివ‌ల్ల బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీకి కూడా మ‌సిప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని శివాజీ వివ‌రించారు. కాగా, కృష్ణా పుష్క‌రాల స‌మ‌యంలోనూ శివాజీ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. పుష్క‌రాల్లో ప్ర‌త్యేక హోదా కోసం ప్రాణాలు విడిచిన మునికోటి లాంటి వారికి ఆయ‌న పిండ ప్ర‌దానం చేశారు. అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్యాకేజీ చాలంటున్న‌వారికి కూడా ఆయ‌న పిండ ప్ర‌దానం చేయ‌డం గ‌మ‌నార్హం.

అదేవిధంగా కొద్ది సేపునీళ్ల‌లో ఉండి జ‌ల దీక్ష సైతం చేశారు. ప్ర‌త్యేక హోదా సాధించ‌లేని వాళ్లు త‌న‌ను విమ‌ర్శిస్తున్నారంటూ వైకాపా నేత‌ల‌ను సైతం ఆయ‌న విమ‌ర్శించారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక ప్యాకేజీని మాత్ర‌మే కోరుతున్నార‌ని అన్నారు. ఇక‌, రెండు రోజుల కింద‌ట కూడా శివాజీ.. ఏపీ సీఎం స‌హా మంత్రి వ‌ర్గంపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని, చంద్ర‌బాబు ఇంటి ముందు త‌న శవం ఉంటుంద‌ని అన్నారు. మ‌రి కొద్ది సేప‌ట్లోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా లేదా ప్ర‌త్యేక ప్యాకేజీపై కేంద్రం మ‌న‌సులో మాట వెల్ల‌డికానుంది. ఈ నేప‌థ్యంలో శివాజీ వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి.
Tags:    

Similar News