''హైకోర్టు ఏర్పాటు.. అంత ఈజీ కాదు''

Update: 2015-04-10 05:49 GMT
ఏపీ హైకోర్టు ఏర్పాటు అంత సింఫుల్‌ కాదన్న విషయాన్ని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఏర్పాటు ఎంత క్లిష్టమైన అంశమన్నది తన వ్యాఖ్య ద్వారా తెలియజేసింది. ''ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయటమంటే పంచాయితీ కార్యాలయం ఏర్పాటు చేసినంత సులభమైన పని కాదు'' అని అసలు విషయాన్ని చెప్పేసింది.

అరకొర వసతులతో.. అయిందంటే.. అయ్యిందన్నట్లుగా చేయటం కుదరదని చెప్పటమే కాదు.. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడు మాత్రమే హైకోర్టు ఏర్పాటు సాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా గతంలో తాను అడిగిన ప్రశ్నకు వారం రోజుల గడువు ఇవ్వాలన్న అభ్యర్థనపై ససేమిరా అంది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించేందుకు మరో వారం రోజులు సమయాన్ని ఇవ్వాలని కోరిన అభ్యర్థనను సాధ్యం కాదని చెప్పేసిన హైకోర్టు.. విభజన వ్యవహారంలో ఏపీ హైకోర్టు సాధనా సమితి కన్వీనర్‌ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటీషన్లను అనుమతించింది.

ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని.. ఇందుకు కేంద్ర.. రాష్ట్ర సర్కారులను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ధన్‌గోపాల్‌రావు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయటం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా హైకోర్టు విభజన అన్నది హడావుడి ప్రక్రియ కాదని.. అన్ని పక్కాగా సిద్ధమైన తర్వాతే విభజన సాధ్యమవుతుందన్న విషయాన్ని హైకోర్టు చెప్పినట్లుగా చెప్పొచ్చని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News