చంద్రబాబు అండ్ కోకు కోర్టుల చివాట్లు

Update: 2017-03-08 05:12 GMT
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు వరుసగా కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు.  తాజాగా  ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి రూ.114 కోట్ల రుణం తీసుకున్నారన్న అభియోగం కేసులో రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు - ప్రత్యూష ఎస్టేట్స్ సంస్థ - ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ సంస్థకు చెందిన డైరెక్టర్లు - ఇండియన్ బ్యాంకు అధికారులకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై దాఖలైన పిల్‌ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అంతకు ఒక్కరోజు ముందే సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు అందాయి. ఇలా నేతలంతా కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది.
    
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ - జస్టిస్ షమీమ్ అక్తర్‌ తో కూడిన ధర్మాసనం విశాఖపట్నం గాజువాకకు చెందిన ఎస్ అజయ్ బాబు అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను విచారించింది. ఈ కేసులో విశాఖ సిటీ పోలీసు కమిషననర్ - జిల్లా కలెక్టర్ - రెవెన్యూ - హోం శాఖ కార్యదర్శులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వీరు అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్ తరపున న్యాయవాది టి లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు. అవసరమైన ఆధారాల డాక్యుమెంట్లను పిల్‌కు జతపరిచినట్లు తెలిపారు.

* ఓటుకు నోటు కేసులో కౌంటర్ వేయాలని సూచిస్తూ చంద్రబాబుకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసుతో ఉన్న సంబంధంపై వైఎస్‌ ఆర్‌ సిపి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ చంద్రబాబును కోర్టు ఆదేశించింది.

* స్పీకర్ కోడెల శివప్రసాద్‌ రావుకు కూడా కోర్టుల నుంచి ఇబ్బంది ఎదురవుతోంది. కరీంనగర్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ కోర్టు మంగళవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 20న స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో తానెంత వ్యయం చేశానో ఓ టీవీ చానల్ కు కోడెల చెప్పడంతో ఆ వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదైంది. కరీంనగర్‌ లోని వావిలాలపల్లికి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌ రెడ్డి 2016 జూలై 11న కరీంనగర్‌ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై అంతకు ముందు ఆయన కరీంనగర్‌ త్రీ టౌన్‌ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన న్యాయస్థానానికి కేసును కోర్టు బదిలీ చేసింది. న్యాయపరిధిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో భాస్కర్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు వివరాలను పరిశీలించిన హైకోర్టు - కేసును విచారించాలని చీఫ్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చీఫ్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ సీసీ నెంబరు 01/2017గా కేసు నమోదు చేసి ఎన్నికల వివాదాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరీంనగర్‌ స్పెషల్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ (మొబైల్‌ కోర్టు) కోర్టుకు కేసును బదిలీ చేసింది.

* ఇక వీరంతా చాలరన్నట్లుగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి శ్యాంబాబుపై వచ్చిన ఆరోపణలపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం మరోసారి ఆరా తీసింది. ఆ పెద్దమనిషి సంగతేమిటంటూ శ్యాంబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతని గురించి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.

* ఇలా చంద్రబాబు అండ్ కో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News