కొత్త అసెంబ్లీ మ్యాప్ ను 3 గంట‌ల్లో ఇవ్వ‌మ‌న్న హైకోర్టు!

Update: 2019-06-29 07:10 GMT
భారీ ప్లాన్ వేసిన‌ప్పుడు అందుకు త‌గినట్లుగా వ్యూహం ఉండాలి. కానీ.. ప్లాన్ భారీగానే ఉన్నా.. దాన్ని అమ‌లు చేసే క్ర‌మంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌కు స‌మాధానం చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌యారుగా లేదా? అన్న సందేహం క‌లిగేలా ప‌రిణామాలు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొత్త అసెంబ్లీ నిర్మాణానికి అవ‌స‌రం ఏమిట‌న్న మాట ఇప్పుడు ప్ర‌తిఒక్క‌రి నోట వినిపిస్తోంది.

ఇదే విష‌యం ఇప్పుడు హైకోర్టు వ‌ద్ద‌కు వెళ్లింది. 294 మంది స‌భ్యుల అవ‌స‌రాల్ని తీర్చిన భ‌వ‌నం 119 మంది స‌భ్యుల అవ‌స‌రాలు తీర్చ‌లేదా?  ఏడు ఎక‌రాల్లో 294 మంది ఎమ్మెల్యేల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన అసెంబ్లీ భ‌వ‌నం వ‌ద్ద‌ని 17 ఎక‌రాల్లో కొత్త భ‌వ‌నాన్ని రూపొందించాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఇదే విష‌యంపై ప్ర‌జాప్ర‌యోజ‌నం వ్యాజ్యాన్ని వేశారు ప‌లువురు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించే క్ర‌మంలో కోర్టు అడిగిన ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదుల నుంచి వ‌చ్చిన స‌మాధానం వింటే అవాక్కు అవ్వాల్సిందే. కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మిందుకు వీలుగా ఇటీవ‌ల శంకుస్థాప‌న చేయటం తెలిసిందే. ఇప్పుడున్న ముహుర్తం మిస్ అయితే.. రానున్న ఆషాడ‌మాసంలో ఏ ప‌ని మొద‌లు పెట్ట‌టానికి వీలు కాదు. శ్రావ‌ణంలో మంచిమ‌హుర్తం చూసుకొని.. అన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముహ‌ర్తాలు ముగిసే లోపు శంకుస్థాప‌న చేస్తే.. అస‌లు ప‌ని నెమ్మ‌దిగా స్టార్ట్ చేయొచ్చ‌ని అనుకుంది ప్ర‌భుత్వం.

ఇదే ఇప్పుడు స‌ర్కారుకు షాక్ త‌గిలేలా చేసింద‌ని చెప్పాలి. కొత్త అసెంబ్లీ నిర్మాణంపై కోర్టు అడిగిన ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వ న్యాయ‌వాది నోట వ‌చ్చిన మాట‌కు హైకోర్టు కాస్తంత ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అసెంబ్లీ ప్లాన్ ను ఇవ్వాల‌ని కోర‌గా.. అందుకు సోమ‌వారం వ‌ర‌కు స‌మ‌యాన్ని అడిగారు లాయ‌రు.దీనికి స్పందించిన కోర్టు.. కొత్త అసెంబ్లీ ప్లాన్ కోసం మూడు రోజులు అవ‌స‌రం ఎందుకు?  మూడు గంట‌ల్లో స‌మ‌ర్పించండి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

గ‌డువు ముగిసినంత‌నే ప్ర‌భుత్వ న్యాయ‌వాది చెబుతూ.. ప్లాన్ ఇంకా సిద్ధం కాలేద‌ని.. ముందుగా శంకుస్థాప‌న పూర్తి చేసిన‌ట్లు చెప్పారు. దీనికి స్పందించిన హైకోర్టు.. ఎలాంటి ప్లాన్ లేకుండా శంకుస్థాప‌న చేయ‌టం ఏమిటి? ప‌్లాన్ సిద్ధం చేయ‌కుండా ఎర్ర‌మంజిల్ ప్యాలెస్ ను ఎలా కూల్చివేస్తారు? అస‌లు కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఎందుకు నిర్మించాల‌ని భావిస్తున్నారో వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ స‌ర్కారును కోరింది. ఇందుకోసం వారం రోజులు స‌మ‌యం ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది. 

ప్ర‌భుత్వం దాఖ‌లు చేసే కౌంట‌ర్లో వాస్త‌విక అంశాలు ఉండాల‌ని.. అసంబ‌ద్ధ‌మైన అంశాలు చెప్పొద్ద‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదికి హైకోర్టు స్ప‌ష్టం చేసింది. కొత్త అసెంబ్లీ భ‌వ‌నం లాంటిపెద్ద భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని అనుకున్న‌ప్పుడు దానికి త‌గ్గ‌ట్లు ప్లాన్ లేక‌పోవ‌టం ఏమిటి కేసీఆర్ జీ!
Tags:    

Similar News