పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2021-01-18 12:53 GMT
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ నిలిపివేయడంతో ఆ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఎస్ఈసీ ఆశ్రయించింది. మరోవైపు, ఏపీ సర్కార్ తీరుపై గవర్నర్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీకి ఉద్యోగులు సహకరించకుండా పరోక్షంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ నిమ్మగడ్డ ఆరోపించారు. మరోవైపు, ఏపీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సినేషన్  కార్యక్రమంలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ షెడ్యూల్‌పై మరిన్ని వివరాలు కావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్  హైకోర్టు ఫుల్‌బెంచ్‌ను ఆశ్రయించారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఆ కేసును హైకోర్టు నేడు విచారణ జరిపింది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోందని, దీంతో, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తెలిపారు. కేంద్రం సూచనలకు అనుగుణంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందని చెప్పారు. దీంతో,  వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ పై మరిన్ని వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఈ వ్యవహారంపై తదుపరి విచారణ ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News