ప్రభాస్ కు జలక్ ఇచ్చిన హైకోర్టు

Update: 2019-01-04 06:38 GMT
ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ భూవివాదం హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ భూమి విషయంలో వాదనలు ముగిశాయి.  న్యాయమూర్తులు జస్టిస్ వి. రామసుబ్రమణియన్ - జస్టిస్ కేశవరావుల ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.  ఈ సందర్భంగా పలు హాట్ కామెంట్స్ చేసింది. తన భూమి న్యాయమైనదని వాదిస్తున్న పిటిషనర్ ప్రభాస్ నిజజీవితంలో విలన్లు వేరుగా ఉంటారని.. సినిమాల్లో విలన్లను ఎదుర్కొన్నట్టు ఇక్కడ ఎదుర్కోవడం అంత ఈజీ కాదని వ్యాఖ్యానించింది.  దీన్ని బట్టి దూకుడుగా వెళ్లవద్దంటూ ప్రభాస్ కు పరోక్షంగా హైకోర్టు హెచ్చరిచ్చినట్టైంది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్ దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లోని ప్రభాస్ ఫాం హౌస్ ను ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు. దీనిపై ప్రభాస్ హైకోర్టుకెల్లాడు.  ప్రభాస్ తరుఫున న్యాయవాది ఈ భూమిని ప్రభాస్ చట్టబద్దంగా కొనుగోలు చేశాడని ఆధారాలు చూపించారు. అధికారులు అన్యాయంగా తమ భూమిని ప్రభుత్వ భూమిగా చూపి సీజ్ చేశారని వాదించారు.

అయితే ప్రభుత్వ న్యాయవాది మాత్రం ప్రభాస్ భూమి కొన్నాక మ్యూటేషన్ చేయించుకోలేదని.. ఫాం హౌస్ లో నిర్మాణాలకు అనుమతి కూడా తీసుకోలేని వాదించారు. అనంతరం భూమి క్రమబద్ధీకరణకు కూడా దరఖాస్తు చేస్తే ప్రభుత్వం తిరస్కరించిందని పేర్కొన్నారు. పిటీషనర్ చెబుతున్న సర్వేనంబర్ కూడా తప్పు అని అది 5/3 కాదని 46 అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. మొత్తం  సర్వేనంబర్  46లోని 86 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది.. ‘ఎవరైనా పేదవాడు అన్యాయం జరిగిందని తన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నాడని హైకోర్టు కొస్తే స్టే ఇచ్చేవాళ్లం.. కానీ ప్రభాస్ లాంటి ఆర్థిక స్థితిమంతులు హైకోర్టులో డబ్బు ఖర్చు పెట్టి పోరాడగలరు. అందుకే స్టే ఇవ్వలేదు. దీని అర్థం స్థితిమంతుల విషయంలో కోర్టు ఇలా వ్యవహరిస్తుందని కాదని.. చట్టం ప్రకారం వారికి న్యాయం జరుగుతుందనే’ అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

ప్రభాస్ ఈ భూమిపై హక్కు ఉందని భావిస్తే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం స్పందించింది. ఇది ప్రభుత్వ భూమి అని తెలియక ప్రభాస్ కొని ఉంటాడని.. అందుకే నిర్మాణాలు చేశారని.. నిర్మాణాలు ఇప్పుడే కూల్చమని ప్రభుత్వం అన్న దృష్ట్యా  తీర్పును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.


Full View

Tags:    

Similar News