తెలంగాణా ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Update: 2021-08-04 13:30 GMT
కోర్టు థిక్కారణ కేసులకు ప్రభుత్వం నుండి ఎలా చెల్లింపులు చేస్తారంటు తెలంగాణా హైకోర్టు తెలంగాణా ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. కోర్టడిగిన సూటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలింది. కోర్టు ధిక్కారణ ఖర్చులకు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు చెల్లించటం అసలు సాధ్యమేనా అన్న కోర్టు ప్రశ్నకు ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే వివిధ కోర్టుల్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయటంలేదు. దాంతో తమ ఆదేశాలను పాటించని ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ కింద జరిమానా విధిస్తోంది. కోర్టు ఆదేశాలను పాటించని అధికారులు ధిక్కరణ కింద చెల్లించాల్సిన మొత్తాన్ని తమ జేబుల్లో నుండే చెల్లించాల్సుంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఉన్నతాధికారులు చెల్లించాల్సిన ధిక్కారం జరిమానాను ప్రభుత్వం ఖజానా నుండి చెల్లిస్తోంది.

ఇదే విషయమై ఓ లెక్షిరర్ కోర్టులో కేసు వేశారు. దాంతో కేసును పరిశీలించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఆశ్చర్యపోయారు. అధికారులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన జరిమానాను ప్రభుత్వం చెల్లించటం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది. అధికారులు చెల్లించాల్సిన జరిమానాకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. ఇందుకు ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతించాయో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది.

కోర్టడిగిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో కోర్టు వెంటనే రెవిన్యు, ఆర్ధిక శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్ కు నోటీసులిచ్చింది. అలాగే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు వ్యక్తిగత హోదాలో నోటీసులిచ్చింది. మరి వీళ్ళు ఏ విధంగా రెస్పాండవుతారో ? కోర్టు స్పందన ఎలాగుంటోందో అనే ఆసక్తి సర్వత్రా మొదలైంది.
Tags:    

Similar News