కేసీఆర్ స‌ర్కారుకు రైతుబంధు నోటీసులు

Update: 2018-06-27 04:12 GMT
సుదీర్ఘ‌కాలం ఉద్య‌మాన్ని న‌డ‌ప‌టం.. అధికారంలో కంటే విప‌క్షంలోనే గ‌డిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యాల‌కు న్యాయ‌స్థానాల నుంచి ఎదురుదెబ్బ‌లు త‌గులుతుంటాయి. ఆయ‌న తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై కోర్టు నుంచి ఆక్షింత‌లు ప‌డిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఎవ‌రేం అనుకుంటే నాకేం.. అన్న‌ట్లుగా త‌న‌కు తోచిన‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం కేసీఆర్‌కు అల‌వాటే. ఇది.. ఆయ‌న‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తీసుకొచ్చింది. ప‌లు నిర్ణ‌యాల్ని ఆయ‌న వెన‌క్కి తీసుకోవ‌ట‌మో.. స‌రిదిద్దుకోవాల్సి  వ‌చ్చేది. తాజాగా అలాంటి సీనే మ‌రోసారి పున‌రావృతం కానుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రైతు బంధు ప‌థ‌కం మీద తాజాగా హైకోర్టుకు ఒక ఫిర్యాదు అందింది.

ఈ ప‌థ‌కం కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీ అయిపోతుంద‌ని.. అర్హుల‌కే ఆర్థిక సాయం అందేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాలంటూ న‌ల్గొండ జిల్లాకు చెందిన న్యాయ‌వాది పి.యాద‌గిరిరెడ్డి రాసిన లేఖ‌కు హైకోర్టు స్పందించింది. రైతు బంధు ప‌థ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని త‌మ ముందు ఉంచాల‌ని మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి ముఖ్య అధికారుల‌కు  నోటీసులు ఇచ్చింది.

తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్.. న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కె. ఉమాదేవిల‌తో కూడిన ధ‌ర్మానం రైత‌బంధుపై త‌మ‌కు అందిన ఫిర్యాదుపై ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఎక‌రాకు రూ.8వేల చొప్పున ప్ర‌తి ఏటా సాయం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌టం.. ఇందులో భాగంగా తొలివిడ‌త‌గా ఎక‌రాకు రూ.4వేల చొప్పున  సాయాన్ని ఇస్తుంద‌ని.. దీనికి బ‌దులుగా అర్హులైన రైతుల‌కే ఆర్థిక సాయాన్ని అందించాలంటూ స‌ద‌రు న్యాయ‌వాది త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. మ‌రి.. ఈ ఫిర్యాదు విచార‌ణ‌పై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News