అక్బర్ మీద ఛార్జిషీట్ కు అన్ని సంవత్సరాలా?

Update: 2016-04-12 07:15 GMT
ఏదైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని చెబుతుంటారు. అంతేకాదు.. చట్టం ముందు అంతా సమానమేనని సినిమా డైలాగులు తరచూ వినిపిస్తుంటాయి. అయితే.. చట్టం ముందు సమానమే అయినా.. కొందరు వ్యక్తులకు మాత్రం మినహాయింపు ఉంటుందన్న విషయం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు.. తెలంగాణ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వారిని చూస్తే అర్థమవుతుంది. తప్పు చేసినప్పుడు ఛార్జిషీట్ నమోదు చేయటానికి కూడా ఏళ్లకు ఏళ్లు ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. అక్బరుద్దీన్ అంటే పోలీసులకు భయమా? లేదా భక్తా అన్న ప్రశ్న వేస్తే పోలీసు ఉన్నతాధికారులకు ఎక్కడ లేని ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు.

కానీ.. వాస్తవం చూస్తే ఈ విమర్శలో ఎంత నిజం ఉందో ఇట్టే అర్థమవుతుంది. యువతలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఆరోపణ మీద 2013లో అక్బరుద్దీన్ మీద రెండు కేసులు నమోదయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కలకలం రేగింది కూడా. అయితే.. ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవటం గమనార్హం. దాదాపు మూడేళ్లు గడుస్తున్నా.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు విషయంలో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయకపోవటాన్ని ఏమనాలి? తాజాగా ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీటు దాఖలు విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ సామాజిక ఉద్యమకారుడు సయ్యద్‌ టి.ఖాద్రి పిటీషన్ వేశారు.

దీనిపై విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలే.. జస్టిస్ పి. నవీన్ రావులతోకూడిన ధర్మాసనం సోమవారం స్పందిస్తూ.. అక్బర్ మీద ఛార్జిషీటు దాఖలు విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ విచారణను ముగించింది. అయితే.. అక్బరుద్దీన్ మీద ఛార్జిషీటును సోమవారం.. సంబధిత న్యాయస్థానంలో దాఖలు చేసినట్లుగా తెలంగాణ హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది పేర్కొనటం గమనార్హం. అంటే.. అక్బరుద్దీన్ చేసిన నేరానికి సంబంధించిన ఛార్జిషీటు దాఖలు కావాలంటే.. హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేస్తే తప్ప ఛార్జిషీట్ తయారుకాదా? అన్న సందేహం కలగక మానదు. ఛార్జ్ షీట్ కే మూడేళ్ల సమయం తీసుకున్న పోలీసులు.. దీని విచారణ ముగిసి.. అక్బరుద్దీన్ మీద తీర్పు వచ్చేసరికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో? అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వారి విషయంలో చట్టం తన పని తాను ఎందుకు చేసుకుంటూ పోదు..?
Tags:    

Similar News