జేసీకి బాబు స‌ర్కారు దెబ్బేసిందే!

Update: 2017-07-19 08:15 GMT
త‌మ పార్టీలో చేరిన అనంపురం రాజ‌కీయ‌వేత్త‌లు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌కు చెందిన దివాక‌ర్ ట్రావెల్స్ వ‌త్తాసు ప‌లుకుతూ టీడీపీ ప్ర‌భుత్వం ఇచ్చిన క్లీన్ చిట్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీలోని ఆ పార్టీ ప్ర‌భుత్వానికి పెద్ద గుదిబండ‌గానే మారింద‌ని చెప్ప‌క త‌ప్పదు. కృష్ణా జిల్లా మూల‌పాడు వ‌ద్ద ఇటీవ‌ల జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో దివాక‌ర్ ట్రావెల్స్‌ కు చెందిన బ‌స్సు కాలువ‌లో ప‌డిపోయింది. 11 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ ప్ర‌మాదానికి డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తే కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా వినిపించింది. సిబ్బందికి సెల‌వులు ఇవ్వ‌కపోవడం, దూర‌ప్రాంత ప్ర‌యాణాల‌కు ఇద్ద‌రు డ్రైవ‌ర్ల‌ను వినియోగించాల‌న్న నిబంధ‌న‌ను దివాక‌ర్ ట్రావెల్స్ పాటించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని కూడా నాడు ఆరోప‌ణ‌లు వినిపించాయి. దీనిపై ప‌క్కా విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

అయితే త‌మ ట్రావెల్స్ నిబంధ‌న‌ల‌ను ఏనాడూ అతిక్ర‌మించ‌లేద‌ని చెప్పిన జేసీ సోద‌రులు... జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై ఎదురు దాడుల‌కు దిగారు. ఆ తతంగం ముగిసిన త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం మొత్తం హైకోర్టు గ‌డ‌ప తొక్క‌గా... జేసీ బ్ర‌ద‌ర్స్‌ ను కాపాడుతూ చంద్రబాబు స‌ర్కారు కోర్టుకు ఓ అఫిడ‌విట్‌ ను స‌మ‌ర్పించింది. దివాక‌ర్ ట్రావెల్స్ నిబంధ‌న‌ల‌ను ఏమాత్రం అతిక్ర‌మించ‌లేద‌ని, చిన్న పొర‌పాటు కార‌ణంగానే ఆ ప్ర‌మాదం సంభ‌వించిందని తెలిపింది. అదే స‌మ‌యంలో దివాక‌ర్ ట్రావెల్స్ యాజ‌మాన్యం ఏనాడూ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకున్న పాపాన పోలేద‌ని తెలంగాణ స‌ర్కారు కోర్టుకు నివేదించింది. దీని ఆధారంగా చంద్ర‌బాబు స‌ర్కారు త‌లంటిన హైకోర్టు ధ‌ర్మాస‌నం... వాస్త‌వాల‌ను చెబుతూ మ‌రో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు అక్షింత‌ల‌తో అస‌లు విష‌యం చెప్ప‌క త‌ప్ప‌ద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు స‌ర్కారు... జేసీ బ్ర‌ద‌ర్స్‌కు షాకిచ్చేలా వ్య‌వ‌హ‌రించింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి నిన్న జ‌రిగిన విచార‌ణ‌లో ఏపీ స‌ర్కారు హైకోర్టుకు రివైజ్డ్ అఫిడ‌విట్‌ ను స‌మ‌ర్పించింది. అందులో మొత్తం జేసీ బ్ర‌ద‌ర్స్‌దే త‌ప్ప‌న్న‌ట్లుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కోర్టు ముంగిట ఒప్పుకోక త‌ప్పింది కాదు. జేసీ బ్ర‌ద‌ర్స్ ఆధ్వ‌ర్యంలోని దివాక‌ర్ ట్రావెల్స్ మోటారు వాహ‌న చ‌ట్టాన్ని ఉల్లంఘించింద‌ని ప్ర‌భుత్వం ఒప్పుకుంది. ప‌ని విభ‌జ‌న‌ - వారాంత‌పు విశ్రాంతి, ఏటా సెల‌వులు ఇవ్వ‌డం వంటి త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న‌ల‌ను దివాక‌ర్ ట్రావెల్స్ తుంగ‌లో తొక్కేసింద‌ని వెల్ల‌డించింది. మూల‌పాడు ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు అశ్వ‌త్ రెడ్డి.. దివాక‌ర్ రోడ్ లైన్స్ పేరిట జూన్ 26న 84 మంది కార్మికుల‌ను, జూన్ 27న ప్ర‌భాక‌ర్ రెడ్డి భార్య ఉమారెడ్డి 220 మంది కార్మికుల పేర్ల‌ను రిజిష్ట‌ర్ చేశార‌ని చెప్పింది. ఈ మేర త‌ప్పులు చేసిన దివాక‌ర్ రెడ్డి ట్రావెల్స్‌తో పాటు మిగిలిన ట్రావెల్స్‌కు కూడా నోటీసులు జారీ చేస్తున్న‌ట్లు కూడా బాబు స‌ర్కారు ధ‌ర్మాస‌నానికి తెలిపింది.
Tags:    

Similar News