ఆదిలోనే వాడీవేడీ... ఉస్మానియా కూల్చివేతపై హైకోర్టులో విచారణ

Update: 2020-08-17 17:30 GMT
భాగ్యనగరి హైదరాబాద్ లోని సర్కారీ దవాఖానాలకే పెద్ద దిక్కుగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాలను కూల్చివేయాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయంపై ఎట్టకేలకు హైకోర్టులో సోమవారం వాదనలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో రెండు రకాల పిటిషన్లు దాఖలు కాగా... అన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఉస్మానియాను కూల్చాలన్న సర్కారు వాదనను సమర్థిస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయగా... మరికొందరు కూల్చివేతను నిలిపివేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. విషయం ఒక్కటే అయినందున అన్ని పిటిషన్లను ఒకే అంశంగా పరిగణిస్తూ విచారిస్తామని హైకోర్టు తెలిపింది. కేవలం పిటిషన్ల ప్రస్తావన సందర్భంగానే హైకోర్టులో సోమవారం వాడీవేడీ వాదనలు సాగాయి. అసలు విషయం మొదలు కాకముందే... ఈ మేర వాడీవేడీ వాదనలు సాగితే... ఇక అసలు విషయానికి వచ్చేసరికి ఈ విచారణ ఇంకెంత వేడి రాజేస్తుందన్న విషయంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

నిజాం కాలం నాటి భవనాల్లో సాగుతున్న ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేయాలని, దాని స్థానంలో ట్విన్ టవర్స్ నిర్మించాలని కేసీఆర్ సర్కారు గతంలోనే నిర్ణయించింది. అయితే పురాతన భవనం అయిన ఉస్మానియా ఆస్పత్రి భవనాలను కూల్చడానికి వీల్లేదని, సదరు ఆస్పత్రి ఆవరణలోని ఖాళీ స్థలంలోనే కొత్త భవనాలను నిర్మించవచ్చని విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కారు ఈ విషయాన్ని పక్కనపెట్టేయగా... మొన్నటి వర్షాలకు ఆస్పత్రి ఆవరణలోకి వర్షపు నీరు చేరగా... మరోమారు ఈ అంశాన్ని కేసీఆర్ సర్కారు తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిని కూల్చొద్దని కొందరు, కూల్చేయాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బంది మాత్రం భవనం పాతదైన నేపథ్యంలో కూల్చివేయడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు.

ఇక సోమవారం నాటి విచారణ సందర్భంగా హైకోర్టులో వాడీవేడీ వాదనలు సాగాయి. ఈ కేసులో ఇంప్లీడ్ చేసుకోవాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రచనా రెడ్డి తన వాదనలు వినిపించగా... ఆమె వాదనలను తిప్పికొడుతూ మరో న్యాయవాది సందీప్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఉస్మానియా ఆస్పత్రి భవనాల కూల్చివేతలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు ఆస్కారం ఏముందని ప్రశ్నించారు. విషయాన్ని రాద్దాంతం చేసేందుకే ఇలా చాలా మంది ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా సందీప్ రెడ్డి ధర్మాసనానికి సూచించారు. అయితే రచనా రెడ్డి కూడా ఆయన వాదనకు ధీటుగానే బదులివ్వడంతో కోర్టులో వాడీవేడీ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు... ఈ వ్యవహారంపై ఎన్ని పిటిషన్లు వచ్చినా అన్నింటినీ కలిపి విచారిస్తామని చెప్పిన ధర్మాసనం... తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. అసలు వాదనలు 24న మొదలుకానుండగా... సదరు వాదనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News