అప్పుల కోసం గ‌వ‌ర్న‌ర్ పేరు వాడ‌తారా?

Update: 2021-10-22 10:42 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతున్న సంగ‌తి తెలిసిందే.  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించాల‌న్నా సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు విడుద‌ల చేయాల‌న్నా రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా న‌డిపించడం కోసం ప్ర‌భుత్వం కూడా అవ‌కాశం ఉన్న ప్ర‌తి మార్గంలోనూ అప్పులు చేస్తూనే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ప్ర‌భుత్వ విధానాన్ని రాష్ట్ర హైకోర్టు త‌ప్పు ప‌ట్టింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేష‌న్ (ఎపీఎస్‌డీసీ) ద్వారా రూ.25 వేల కోట్ల రుణం పొందేందుకు బ్యాంకుల‌తో చేసుకున్న ఒప్పందంలో వ్య‌క్తిగ‌తంగా గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ పేరును ప్ర‌భుత్వం చేర్చ‌డాన్ని హైకోర్టు తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది.  

అస‌లేం జ‌రిగిందంటే.. ఎపీఎస్‌డీసీ ద్వారా రూ.25 వేల కోట్ల రుణం పొందేందుకు బ్యాంకుల‌తో చేసుకున్న ఒప్పందంలో రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ పేరును చేర్చింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ సార్వ‌భౌమాధికారాన్ని ప్ర‌భుత్వం వ‌దులుకున్న‌ట్ల‌యింది. విశాఖ‌లోని ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ఎస్బీఐ క్యాప్ ట్ర‌స్ట్‌కు త‌న‌ఖా పెట్టారు. ఈ ప్ర‌భుత్వ ఆస్తులు తాక‌ట్టు పెట్టి తీసుకున్న అప్పులు చెల్లించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైతే బ్యాంకులు గ‌వ‌ర్న‌ర్‌కు నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా కేసులు పెట్టేందుకు ఆస్కార‌ముంది. కానీ గ‌వ‌ర్న‌ర్‌పై ఎవ‌రైన వ్య‌క్తి లేదా ఏదైనా సంస్థ కేసులు న‌మోదు చేయ‌కుండా రాజ్యంగంలోని ఆర్టిక‌ల్ 361 ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది. కానీ ఇప్పుడు ప్ర‌భుత్వం రుణాల కోసం బ్యాంకుల‌తో చేసుకున్న ఒప్పందంలో గ‌వ‌ర్న‌ర్ పేరు చేర్చ‌డంతో దానికి విఘాతం క‌లిగేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

ఏపీఎస్‌డీసీ ఏర్పాటు అప్పులు తీసుకునే విధానం ఇత‌ర నిబంధ‌న‌ల‌ను స‌వాలు చేస్తూ దాఖ‌లైన ప‌లు వ్యాజ్యాల‌పై తాజాగా హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.  చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, జ‌స్టిస్ సి.ప్ర‌వీణ్ కుమార్తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. బ్యాంకుల‌తో చేసుకున్న ఒప్పందంలో గ‌వ‌ర్న‌ర్ పేరును చేర్చ‌డాన్ని త‌ప్పు ప‌ట్ట‌డంతో పాటు ప్ర‌భుత్వ ఆదాయాన్ని క‌న్సాలిడేటెడ్ ఫండ్‌కు జ‌మ చేయ‌కుండా నేరుగా ఎపీఎస్‌డీసీకి ఎలా బ‌దిలీ చేస్తార‌ని ప్ర‌శ్నించింది. నిధుల బ‌దిలీకి సంబంధించి ఒరిజిన‌ల్ ద‌స్తావేజుల‌ను త‌మ ముందుంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విష‌యంలో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికీ నోటీసులు జారీ చేసింది.

ఎస్‌డీసీ ద్వారా రూ.25 వేల కోట్ల భారీ మొత్తాన్ని అప్పుగా తేవ‌డం రాజ్యాంగ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని కేంద్ర‌మే లేఖ రాసినందున కేంద్రంతో పాటు అప్పులిచ్చిన 8 బ్యాంకులు కౌంట‌ర్ దాఖ‌లు చేసేలా ఆదేశాలివ్వాల‌ని పిటిష‌న‌ర్లు కోరారు. దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ధ‌ర్మాస‌నం కేంద్రానికి నోటీసులు ఇస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 15కి వాయిదా వేసింది. మ‌రోవైపు ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయాన్ని నేరుగా ఎపీఎస్‌డీసీలో జ‌మ చేస్తున్నామ‌న్న వాద‌న‌లో నిజం లేద‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున ఏజీ ఎస్‌.శ్రీరామ్ స‌మాధాన‌మిచ్చారు. మ‌రోవైపు హైకోర్టులో విచార‌ణ మొద‌లు కావ‌డంతో ప్ర‌భుత్వం హడావుడిగా క్యాపిట‌ల్ ఇన్‌ఫ్యూజ‌న్ పేరుతో రూ.894 కోట్లు ఎపీఎస్‌డీసీ ఖాతాలో జ‌మ చేసింది. వాస్త‌వానికి ఈ ప‌ద్దు కింద ఖాతాలో రూ.900 కోట్లు ఉండాలి. కానీ ఈ నిధుల‌న్నీ ప్ర‌భుత్వం వాడేసుకుంది. ఇప్పుడు విచార‌ణ జరుగుతుండ‌డంతో తిరిగి జ‌మ చేసింది. మ‌రోవైపు ప్ర‌భుత్వం వివిధ మార్గాల్లో తెచ్చుకుంటున్న ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌కే ప్ర‌భుత్వం త‌ర‌పున గ్యారెంటీగా ఆర్థిక శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న అధికారే సంతాలు పెడుతున్న‌ట్లు తెలిసింది. ఎపీఎస్‌డీసీ ద్వారా తెచ్చిన రూ.25 వేల కోట్ల‌కు ఆయ‌నే సంత‌కం పెట్టార‌ని స‌మాచారం. కానీ ఇప్పుడేమో ఈ రుణానికి గ‌వ‌ర్న‌ర్‌కూ సంబంధం లేద‌ని ఏజీ కోర్టులో చెప్పారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకులు ఆ అప్పుల‌ను ఎవ‌రిని అడ‌గాల‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. మ‌రి ఈ అంశం ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News