బాబు ఆలోచ‌న‌పై ర‌చ్చ ర‌చ్చ అవుతోంది

Update: 2017-03-23 05:56 GMT
ఏపీలోని కాపుల‌ను బీసీల్లో చేర్చేందుకు సీఎం చంద్ర‌బాబు వేసిన మంజునాథ క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న‌లు వివాదంలో ప‌డుతున్నాయి. కాపు ఉద్యమం పురుడు పోసుకున్న తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రమైన కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ బహిరంగ విచారణ రసాభసగా మారింది. బీసీలు కమీషన్‌ పై ఆరోపణలు చేసి బహిరంగ విచారణను బహిష్కరిస్తే కాపు సామాజిక వర్గం రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగడంతో అసహనం వ్యక్తం చేసిన కమిషన్‌ తీవ్ర ఆగ్రహావేశాలతో విచారణను అర్ధాంతరంగా నిలిపి వేసి నిష్క్రమించింది. కమిషన్‌ పనితీరును నిరశిస్తూ బీసీ సంఘాలు విచారణ జరుగుతున్న ప్రాంతంలో ధర్నాకు దిగాయి. ఇక పోలీసులైతే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి నిర్భందాన్ని అమలు చేశారు.

కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్ తో మరికొన్ని కుల సంఘాలు ఈ డిమాండ్‌ లేవనెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ కేఎల్‌ మంజునాథ‌ అధ్యక్షతన బీసీ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిషన్‌ రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ పర్యటించింది. చివరిగా కాకినాడ‌లో బ‌హిరంగ విచార‌ణకు వ‌చ్చింది. కాపు కులాలను బీసీలో చేర్చమని కోరేవారిని ఒక ప్రక్క, బీసీలో ఉన్నవారిని ఒక గ్రూఫు నుంచి మార్చమని కోరేవారిని మరో ప్రక్క విడదీసి బహిరంగ విచారణను ప్రారంభించారు. మత్స్యకారులు తమను ఎస్టీలో చేర్చాలని - శెట్టిబలిజలు తమను ఎస్‌ సిలో చేర్చాలని తమ వాదనలు వినిపించారు. అలాగే బిసి బి - సి - డి లో ఉన్నవారు తమను ఏ లోకి మార్చాలని వాదనలు వినిపించారు. మధ్యాహ్న భోజనం అనంతరం రెండో సెషన్‌ ప్రారంభమైంది. ఈ సారి కాపు - బలిజ - ఒంటరి - తెలగ - సంఘాలవారి వాదనలను కమిషన్‌ కోరింది. మొత్తం పదిమంది ఆయా సంఘాల నాయకులు తమ వాదనలు వినిపిస్తామని పేర్లు ఇచ్చారు. ఆ సీరియల్‌ ప్రకారం వారికి మాట్లాడే అవకాశాన్ని కమీషన్‌ కల్పించింది. ఇక్కడే గొడవ ప్రారంభమైంది. 149 బీసీ సంఘాలుండగా తమకు ఇద్దరు - ముగ్గురుకు మించి అవ కాశమివ్వలేదని, కాపులకు మాత్రం ఒకేసారి అంతమందికి అవకాశం ఎలా ఇస్తారంటూ బీసీలు వాదనకు దిగారు. అయినా కమిషన్‌ వినిపించుకోలేదు. కాపు సామాజిక వర్గం నుంచి పదిమంది మాట్లాడాక మరో పదిమంది బీసీలకు అవకాశ మిస్తామని కమిషన్‌ చైర్మన్‌ మంజునాధ హామీ ఇచ్చారు. అయినా బీసీ సంఘాల ప్రతినిధులు వినలేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీసీలను అవమానిస్తున్నారంటూ వాదనలకు దిగారు. ఈ వివాదం పెరిగింది. కాపు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతుండగా బీసీ సంఘాల వారు అడ్డు తగిలారు. ఇది మంచి పద్ధతి కాదంటూ పదే పదే కమిషన్‌ చైర్మన్‌ చెప్పినా వారు వినలేదు. ఈ దశలో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన చైర్మన్‌ మంజునాధ వీరిని బయటకు తీసుకుపోండంటూ పోలీసుల‌ను ఆదేశించారు. దీంతో బిలబిలమం టూ పోలీసు దళాలు బీసీ నాయకులను చుట్టుముట్టాయి.

పోలీసులు రంగ ప్రవేశం చేయ‌డంతో బీసీల్లో ఆగ్రహం పెరిగింది. దీంతో తమను బహిరంగ విచారణకు పిలిచి పోలీసులతో నెట్టివేయిస్తారా, అవమానిస్తారాంటూ కమిషన్‌ కు వ్యతిరేకంగా బీసీ నాయకులంతా ఆందోళనకుదిగారు. దీంతో సమావేశం రసాభాస గా మారింది. కమిషన్‌ సభ్యులు సముదాయించినా వినలేదు. బీసీలు కేకలు - అరుపులతో హాలు దద్దరిల్లింది. జిల్లా ఎస్పీ - అడిషినల్‌ ఎస్‌ పీతో సహా సుమారు వందమంది వరుకు పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఓదశలో వారిని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధపడ్డారు. కాపుల వాదనలు విన్నాక బీసీల్లో పదిమందికి అవకాశమిస్తానంటూ జస్టీస్‌ మంజునాధ చెప్పినప్పటికీ వారు వినలేదు. ఓ దశలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కమిషన్‌ నే శాసిస్తారాంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ ప్రక్క బీసీలు ఆందోళన చేస్తుండగానే కాపు సామాజిక వర్గంనుంచి వైసిపి నాయకులు ఆకుల రామకృష్ణ తన వాదనలు కొనసాగించారు. ఆయన చేసినవాదనతో బిసిలు మరింత మండిపడ్డారు. చివరికి బీసీలు తాము బాయ్‌ కాట్‌ చేస్తున్నామంటూ బహిరంగ విచారణను బహిష్కరించి సమావేశపు హాలు వద్ద ధర్నాకు దిగారు. వారు వెళ్ళిన అనంతరం తిరిగి విచారణ ప్రారంభమైంది. ఆకుల రామకృష్ణ సుదీర్ఘంగా ప్రసంగిస్తుండగా చైర్మన్‌ అడ్డుకున్నారు. అనంతరం కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ మైకు తీసుకుని తన వాదనలు వినిపిస్తుండగా అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ వాదనలు వినిపించడం మాని - వెయ్యికోట్లు ఇచ్చాం - అది చేసాం - ఇది చేసామన్న గాలి కబుర్లు ఎందుకంటూ అడ్డుకున్నారు. ప్రసంగించేవారి జాబితాలో లేని తెలుగు దేశం నాయకుడికి అవకాశం ఎలా ఇస్తారంటూ కాపు నాయకులు కమిషన్‌ ను ఎదురు ప్రశ్నించారు. కమిషన్‌ కూడా సమాధానం చెప్పలేదు. రామానుజయ ప్రసంగిస్తుం డగా కాపు నాయకులు అడ్డుతగిలారు. ఆయన్ను మాట్లాడ నీయలేదు. తాను కార్పొరేషన్‌ చైర్మన్‌ అంటూ చెప్పుకొచ్చినా ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. మరోసారి సమావేశం రసాభసగా మారింది. జిల్లా ఎస్‌ పి రవి ప్రకాష్‌, అడిషినల్‌ ఎస్‌ పి దామోదర్‌, అధిక సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సద్దిచెప్పే ప్రయత్నం చేసారు. అయినా రామానుజ మాట్లాడ్డానికి లేదంటూ కాపులే అడ్డుపడ్డారు. దీంతో కమిషన్‌ చైర్మన్‌ తీ వ్ర అసహనానికి గురయ్యారు. ఒకళ్ళేమో బహిష్కరిస్తారు, మరో వర్గంలో మీలో మీరే వాదనకు దిగుతారాంటూ ఆ గ్రహం వ్యక్తంచేసి విచారణను అర్ధాంతరంగా నిలిపివేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. కాగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జస్టీస్‌ మంజు నాధ కమిషన్‌ ఎదుట బీసీ సంఘాలు రెండు వర్గాలుగా కాపులు విడిపోయి ఆందోళనకు దిగినా పట్టించుకోని పోలీసులు ఆ సన్నివేశాలను ఫోటోలు తీయవద్దని , చిత్రీకరించవద్దంటూ ఆంక్షలు విధించారు. ఇలా చేస్తే బయటకు గెంటేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసారు. మొత్తంగా కమిషన్‌ కు చివరి జిల్లా పర్యటనైన కాకినాడలో ఒకింత చేదు అనుభవం ఎదురైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News