ఓల్డ్ సిటీలో హై టెన్షన్...రూ.70 కోట్ల ల్యాండ్ వివాదం

Update: 2020-12-16 13:38 GMT
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని బీజేపీ నేతలు, పలు హిందూ సంస్థలు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో విలువైన దేవాదాయ శాఖ భూముల అమ్మకం, తిరుమల వెంకన్న హుండీ ఆదాయాన్ని ప్రభుత్వం అప్పుగా తీసుకోవడం వంటి ప్రతిపాదనలపై వివాదం చెలరేగిన విషయం విదితమే. ఇదే కోవలో తెలంగాణలోని పాతబస్తీలో ఉన్న ఉప్పుగూడ కాళికామాత దేవాలయానికి సంబంధించిన స్థలం అన్యాక్రాంతం నేపథ్యంలో వివాదం చెలరేగింది. పాతబస్తీలోని 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన ఆ స్థలం తనదంటూ వేరే వ్యక్తి అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు అడ్డుకున్నారు. ఆ నిర్మాణాలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను,నేతలను పోలీసుల అడ్డుకోవడంతో ఓల్డ్ సిటీలో హై టెన్షన్ ఏర్పడింది. బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది.

1951లో ఈ స్థలాన్ని దేవాదయశాఖ అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 11 సార్లు ఈ స్థలం వేలం పాట ప్రకటనలు ఇవ్వగా...ఓ సారి వేలం పాటలో ధర తక్కువగా రావడంతో సీపీఐ నాయకులు హైకోర్టును ఆశ్రయించి వేలంపాట రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఓ వ్యక్తి తాజాగా ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు అమ్మిందని చెబుతున్నారు. ఆ భూమి తనదని సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకువచ్చారు. ప్రహరీ నిర్మాణం చేపడుతుండగా స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుపడడంతో పోలీసుల సమక్షంలో ఆలయ భూముల చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, స్థానికులు ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో వివాదం రేగింది. మరి, ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News