సంపన్నులంతా సామాన్యులైన ‘ఒకే ఒక్క రోజు’

Update: 2016-11-10 03:51 GMT
అతిశయోక్తిగా అనిపించినా కాస్త ఆలోచించి చూస్తే నిజమనించాల్సిందే. సమాజంలో ధనిక.. పేద అన్న తారతమ్యం లేకుండా అందరూ ఒకేలా ఉండాలన్న సమసమాజ సిద్ధాంతాన్ని కొమ్ములు తిరిగిన కమ్యూనిస్టు నేతలు సైతం చేయలేకపోయారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఉద్యమ నేతలు సైతం తమ జీవితకాలంలో తాము అనుకున్నది చేయలేకపోయారు.

కానీ.. ప్రధాని మోడీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో దేశ ప్రజలంతా ఒక్కరోజు అందరూ సమానంగా మారిపోయిన పరిస్థితి.వందల కోట్లు ఆస్తులున్నప్పటికీ చేతిలో డబ్బుకు కటకటలాడిపోయిన రోజు ఏదైనా ఉందంటే అది ‘బుధవారమే’ అని చెప్పక తప్పదు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో చిత్రమైన వాతావరణం ఏర్పడింది. పెద్దా..చిన్న.. ధనిక.. పేద అన్న తేడా లేకుండా అందరూ ఒకే ఆర్థిక హోదా కలిగిన వ్యక్తులుగా మారిపోయారు.

చేతిలో చిన్న నోట్లు ఉంచుకోవటం ఎప్పుడో మానేసిన దేశ ప్రజల తీరు.. దీనికి తగ్గట్లే ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా గంటల వ్యవధిలోనే పెద్ద నోట్ల చెలామణిని రద్దు చేసిన మోడీ సాహసోపేతమైన నిర్ణయంతో దేశంలోని ప్రజలంతా ఒకేలాంటి ఆర్థిక పరిస్థితితో ఒక రోజంతా ఉండిపోయారు. బ్యాంకులు పని చేయక.. చేతిలో డబ్బుల్లేక విలవిలాడిపోయారు. తాజాగా పరిణామాన్ని పలువురు సంపన్నులు ఒకలాంటి కినుకుతో.. ‘‘ఇవాల్టి రోజున డబ్బులున్నోళ్లు.. డబ్బులేనోళ్లు అన్న తేడా ఏమీ లేదు. అందరూ డబ్బుల్లేనోళ్లే. ఎవరి చేతిలోనూ డబ్బుల్లేవు. ఇవాల్టి వరకూ అందరం పేదేళ్లమే’’ అంటూ చెప్పిన మాట అక్షర సత్యమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News