భారీ బాదుడు ప్రస్తుతానికైతే లేదట!

Update: 2019-09-02 05:55 GMT
ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా ఫాలో కావాల్సిందే. నిజానికి.. అలా చేస్తే ప్రమాదాలు పెద్ద సంఖ్యలో తగ్గటమే కాదు.. వందలాది మంది ప్రాణాలు పోకుండా ఉండే పరిస్థితి. కానీ.. నిర్లక్ష్యం.. నిబంధనలు కరకుగా లేని తీరు.. వెరసి రోడ్డు మీద వాహనాల మీద వెళ్లే వారిలో అత్యధికులు తమ అవసరాలు తప్పించి మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించటం కనిపిస్తూ ఉంటుంది.

ఇలాంటి ధోరణికి చెక్ పెట్టేలా కేంద్రంలోని మోడీ సర్కారు సరికొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 తీసుకొచ్చింది. ఆ మధ్యన వచ్చిన భరత్ అనే నేను సినిమాలో మహేశ్ నటించిన ముఖ్యమంత్రి పాత్రలో.. రోడ్డు మీద ఇష్టారాజ్యంగా వెళ్లే వారికి దిమ్మ తిరిగేలా భారీ జరిమానాలు విధించటం.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావటం కనిపిస్తుంది. అయితే.. ప్రజల్లో బాధ్యత పెంచేందుకు వీలుగా భయపెట్టేలా జరిమానాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంటారు. సదరు సినిమాలో మాదిరే.. మోడీ సర్కారు సైతం కొత్త మోటారు వాహన సవరణ చట్టం ద్వారా పెద్ద ఎత్తున ఫైన్లు విధించేందుకు సిద్ధమయ్యారు.

కొన్ని రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. భారీగా బాదేసే ఈ కొత్త చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత రావటంతో పాటు ప్రభుత్వానకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త మోటారు వాహన సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురాలేదు. ఈ కారణంగా సెప్టెంబరు ఒకటిన కూడా పాత చలానాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

చట్టంలో పేర్కొన్న రీతిలో ఇప్పటికైతే జరిమానాలు పాత చట్టం ప్రకారమే నిర్వహిస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి రావటానికి మరికొంత టైం పడుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల వారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పాత ఫైన్లే విధిసంచనున్నారు. ఇటీవల హైదరాబాద్ పోలీసులు పలువురు వాహన ఉల్లంఘనుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారందరికి పాత ధరలకే చలానాలు రాసేసి పంపారు. అంతేకాదు.. కొత్త జరిమానాలు భారీగా ఉంటాయన్న అవగాహన కల్పించటమే కాదు.. వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వాహనాన్ని నిబంధనలకు తగ్గట్లు నడిపితే.. ఆర్థికంగా ఎంత లాభం వస్తుందన్న విషయాన్ని ఫ్లెక్సీల రూపంలో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మరి.. కొత్త చట్టాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారో చూడాలి.


Tags:    

Similar News