హిమాచల్‌.. ఆ ఆనవాయితీ మారలేదు!

Update: 2022-12-09 00:30 GMT
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఆనవాయితీని తప్పలేదు. తమ పాత సంప్రదాయాన్నే కొనసాగించారు. అక్కడ వరుసగా ఏ పార్టీని హిమాచల్‌ ఓటర్లు గెలిపించడం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని వచ్చే ఎన్నికల్లో మార్చేయడం ఈ రాష్ట్రంలో ప్రత్యేకత. అందులోనూ రెండు పార్టీలకు మాత్రమే హిమాచల్‌ ఓటర్లు పట్టం కడుతున్నారు.

ఐదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే.. ఆ తర్వాత ఐదేళ్లకు బీజేపీకి అవకాశమిస్తున్నారు. మళ్లీ బీజేపీ తర్వాత కాంగ్రెస్‌ను గెలిపిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీకి చాన్సు ఇస్తున్నారు. ఇలా హిమాచల్‌ ఓటర్లు ఆనవాయితీని తప్పకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని తర్వాత ఎన్నికల్లో ఓడిస్తున్నారు.

ప్రస్తుతం హిమాచల్‌ లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీని పక్కనపెట్టి కాంగ్రెస్‌ కు ఓట్లేసి గెలిపించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోంది.

ఈసారి ఈ ఆనవాయితీని బ్రేక్‌ చేసి మళ్లీ వరుసగా తామే అధికారంలోకి వస్తామని బీజేపీ భావించింది. అందులోనూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లు హిమాచల్‌ ప్రదేశ్‌ కు చెందినవారే. వీరికి తోడు ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు జైరామ్‌ ఠాకూర్, ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ లాంటి నేతలు ఉండటంతో బీజేపీ అధికారంపై ఆశలు పెట్టుకుంది.

ఆనవాయితీని బ్రేక్‌ చేసి వరుసగా అధికారంలోకి వస్తామని భావించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సైతం భారీ ఎత్తున ప్రచారం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తో అద్భుతాలు జరుగుతాయని మోడీ, అమిత్‌ షా ప్రచారం చేశారు.

యువతకు ఉద్యోగాలిస్తామని, ఉమ్మడి పౌరస్మృతిని చేపడతామని బీజేపీ హామీలిచ్చినా హిమాచల్‌ ఓటర్లు తమ ఆనవాయితీని పోనీయకుండా కాంగ్రెస్‌ కే పట్టం కట్టారు.

మరోవైపు హిమాచల్‌ లో ఆర్మీలో పనిచేసే వ్యక్తులు ఎక్కువ ఉండటంతో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ ను రద్దు చేసి ఓపీఎస్‌ ను ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అంతేకాకుండా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. దీంతో హిమాచల్‌ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.

కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సైతం హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో గట్టిగానే ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, తాగునీరు, ఉద్యోగాల కల్పన ఇలా ఎన్నో హామీలిచ్చింది. అయినా హిమాచల్‌ ఓటర్లు తమ ఆనవాయితీని వదలలేదు. బీజేపీ లేదా కాంగ్రెస్‌ లనే మాత్రమే ఎంచుకుంటూ వస్తున్న సంప్రదాయాని కొనసాగించారు.

1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించిన ఓటర్లు 1990లో బీజేపీని ఎంచుకున్నారు. అలాగే 1993లో మళ్లీ కాంగ్రెస్‌ కు పట్టం కట్టారు. 1998లో మళ్లీ బీజేపీకి చాన్సు ఇచ్చారు. 2003లో కాంగ్రెస్‌ కు, 2007లో బీజేపీకి, 2012లో కాంగ్రెస్‌ కు, 2017లో బీజేపీకి, 2022లో కాంగ్రెస్‌ కు పట్టం కట్టారు. ఇలా ఒకసారి గెలిపించిన పార్టీని తిరిగి వెంటనే మరోసారి గెలిపించడం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News