తాతకు తగ్గ మనవడు

Update: 2016-07-12 08:55 GMT
రాజకీయాలంటే వారసత్వం అన్నట్లుగా మారింది. అందులోనూ భారత దేశంలో రాజకీయం వారసత్వపు హక్కుగానే మారిపోయింది. అందులో కాంగ్రెస్ పార్టీది ఘనమైన వారసత్వం.  దశాబ్దాలుగా ఈ దేశంలో వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ ఒకే కుటుంబం నుంచి ముగ్గురిని ఈ దేశ ప్రధానులను చేసింది. భవిష్యత్తులోనూ అదే కుటుంబం దేశాన్ని పాలించాలని కలలు గంటోంది. ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ మార్గమే అనుసరిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల్లోని ముఖ్యులు తమ వారసులను ముఖ్యులుగా మార్చాలని ప్రయత్నిస్తుంటే పార్టీల్లోని ఇతర ప్రధాన నేతలు తమ సంతానాన్ని రాజకీయాల్లో సుస్థిరంగా నిలపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో రాజకీయ వారసత్వం రాష్ట్రం ఏర్పడడానికి ముందే మొదలైపోయింది.. రాష్ట్రం ఏర్పడిన తరువాత అది మరింతగా విస్తరిస్తోంది.  తండ్రి సీఎం - కొడుకు మంత్రి - కూతురు ఎంపీ - మేనల్లుడు కూడా మంత్రి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం ఈ స్థాయిలో ఉంది. ఇది చాలదన్నట్లుగా మనవడు హిమాంశ్ ను కూడా ఇప్పటి నుంచే బాగా ప్రొజెక్టు చేస్తుండడం కూడా భవిష్యత్తుకు పునాదులు వేయడమనే చెప్పాలి.

కేసీఆర్ కు మనవడు - కేటీఆర్ కు కుమారుడు అయిన హిమాంశుకు రాజకీయ పాఠాల బోధన అప్పుడే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సీఎం మనుమడిగా కేటీఆర్‌ తనయుడికి..రాజకీయనేతలు - బ్యూరోక్రాట్లు ఆ కుర్రాడికి ఇప్పటికే గౌరవం ఇస్తున్నారు. తనలాగే మనుమడు హిమాన్ష్‌ కు కూడా మంచి నాయకత్వ లక్షణాలున్నాయని గుర్తించిన గులాబీ దళపతి కేసీఆర్‌ తెలంగాణకు తమ ఇంటి నుంచి మూడోతరం ప్రతినిధిని కూడా రెడీ చేస్తున్నారన్నమాట. ఎక్కడ ఏ ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా..మనుమడిని వెంట తీసుకెళుతున్నారట.  హిమాంశ్ కూడా తాతకు తగ్గ మనమడు అన్నట్లుగా అల్లుకుపోతున్నాడు.  ఏమాత్రం ఖాళీ దొరికినా  టీఆర్‌ ఎస్‌ భవన్‌ కు వెళ్తున్నాడట. అక్కడ మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - అధికారులతో చాలా ఈజీగా కలిసిపోతూ వారి నుంచి ప్రత్యేక గౌరవం అందుకుంటున్నాడట.

గతంలో హైదరాబాద్‌ లో జరిగే వినాయకచవితి వేడుకల్లోనూ - సంక్రాంతి పండుగ సందర్బంగా హిమాంశ్ సందడి చేశాడు.  కొద్ది రోజుల క్రితం కుర్రాడు తన ఫ్రెండ్స్‌ తో కలిసి సచివాలయానికి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ కు కవిత పిల్లలు మనుమలే అయినా కేటీఆర్‌ తనయుడినే..తన రాజకీయ వారసుడనే విధంగా తెలంగాణ ప్రజలకు ఇప్పటి నుంచే పరిచయం చేస్తున్నారన్న టాక్‌ తెలంగాణ రాజకీయ - అధికారవర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్ తెలివితేటలు - కేటీఆర్ చురుకుదనం రెండూ కనిపిస్తున్న హిమాంశు స్పీడు చూస్తుంటే ఓటు హక్కు రాకముందే రాజకీయాల్లో రాటుదేలిపోయేలా ఉన్నాడని అంటున్నారు.
Tags:    

Similar News