భైంసాలో అసలేం జరిగింది..?

Update: 2016-03-20 04:38 GMT
అదిలాబాద్ జిల్లా భైంసా అట్టుడిగిపోతోంది. మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ ఉదంతం.. స్థానికంగా మాత్రం తీవ్ర ఉద్రిక్తతతో ఉడికిపోవటమే కాదు.. టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు.. నిరసనలు నిర్వహించని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత హైటెన్షన్ కు కారణం ఏమిటన్న సంగతిలోకి వెళితే.. మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటనగా చెప్పొచ్చు.

ఒక జ్యూయలరీ షాపు ప్రారంభం కోసం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఆహ్వానించారు. ఆయనీ కార్యక్రమానికి పాల్గొనేందుకు భైంసా వచ్చిన నేపథ్యంలో.. భారత్ మాతాకీ జై అనే నినాదానికి సంబంధించిన వివాదంపై ఆగ్రహంతో ఉన్న హిందూవాహిని కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేశారు.

దీన్ని అడ్డుకున్న పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే అసద్ కు స్వాగతం పలుకుతూ ఆయన పార్టీ కార్యకర్తలు.. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఇరువర్గాల మధ్య రాళ్లు.. కర్రలతో దాడులు చేసుకున్నాయి. దీంతో అల్లరి మూకల్ని అదుపు చేసేందుకు పోలీసులు పలుమార్లు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.

ఈ మొత్తం వ్యవహారం భైంసా పట్టణంలో హైటెన్షన్ కు కారణమైంది. అల్లరిమూకల దాడుల కారణంగా పోలీసులు.. విలేకరి.. హోంగార్డులతో పాటు.. పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అదనపు బలగాల్ని తీసుకొచ్చారు. మొత్తమ్మీదా అసద్ పర్యటన.. ఇంత రచ్చకు కారణమైందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News