కిక్ సినిమాలోలా.. శిఖర్ ధావన్ ను కొట్టిన అతడి తండ్రి

Update: 2022-05-26 11:30 GMT
మాస్ మహరాజా రవితేజ నటించిన ''కిక్'' సినిమా గుర్తుంది కదా..? 2009 వేసవిలో వచ్చిన ఈ సినిమా నిండైన వినోదాన్ని పంచింది. సూపర్ హిట్ కొట్టింది. రవితేజ హుషారైన నటన.. ఇలియానా అందాలు.. అన్నిటికి మించి.. సినిమాలో హీరోకు ఎప్పుడూ కిక్ కావాల్సి ఉండడం.. దానికోసం అతడు ఎంతకైనా తెగించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా పిల్లలను ఈ సినిమా ఎంతగానో అలరించింది.

కిక్ సీన్ రిపీట్

కిక్ సినిమాలో ఓ సీన్ ఉంటుంది.. రవితేజ హీరోయిన్ ఇలియానాను ఏడిపించినందుకు పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్తారు. రవితేజ కిక్ తీరు చూసి అతడి తండ్రి (షాయాజీ షిండే)కు ఫోన్ చేస్తారు. అయితే.. స్టేషన్ కు వచ్చిన షాయాజీ షిండే  రవితేజను తన పరువు తీశావంటూ కొడతాడు. వీరి మధ్య జరిగే ఆ గొడవతో స్టేషన్ అంతా చిందరవందర అవుతుంది. ఈ సరదా సన్నివేశం ప్రేక్షుకులను ఆపకుండా నవ్విస్తుంది. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడిలాంటి సీనే సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్-అతడి తండ్రి మధ్య చోటుచేసుకుంది.

పంజాబ్ ఓడినందుకంట..

ఈ ఐపీఎల్ సీజన్ 15లో పంజాబ్ సూపర్ కింగ్స్ కు ఓపెనర్ ధావన్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే, మంచి జట్టు ఉన్నప్పటికీ పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. ఆరోస్థానంతో సరిపెట్టుకొంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములు చవిచూసిన ఆ జట్టు దిల్లీతో సమానంగా 14 పాయింట్లు సాధించింది. రన్‌రేట్‌లో వెనుకంజలో ఉన్న దిల్లీ ఐదో స్థానం దక్కించుకుంది. అయితే, లీగ్‌ స్టేజ్‌లో పంజాబ్‌ కనీసం ఇంకొక్క మ్యాచ్‌ గెలుపొందినా చాలా తేలిగ్గా ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించుకునేది. ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరు 16 పాయింట్లు సాధించగా.. రన్‌రేట్‌ దిల్లీ, పంజాబ్‌ జట్ల కన్నా వెనుకంజలో నిలిచింది. దీంతో పంజాబ్‌ త్రుటిలో టాప్‌-4లో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.

''ఎక్కడ ఎక్కడ నా కొడుకు'' అంటూ..

కిక్ సినిమాలో పోలీస్ స్టేషన్ కు వచ్చే షాయాజీ షిండే ఎక్కడ ఎక్కడ నా కొడుకు అంటూ వెదుక్కుంటూ వచ్చి రవితేజను కొడతాడు. ఇప్పుడలాగే.. ధావన్‌ తన తండ్రి చేతిలో సరదాగా దెబ్బలు తిన్నాడు. ''పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ చేరనందుకు మా నాన్న నన్ను కొడుతున్నాడంటూ'' ఈ వీడియోను ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అలనాటి బాలీవుడ్‌ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ను జత చేశాడు కూడా. ఇది వైరల్‌గా మారింది.

వాస్తవానికి ఈ వీడియోను చూస్తుంటే.. ధావన్‌ను అతడి తండ్రి నిజంగానే కొడుతున్నట్టులగా ఉంది. ఎడాపెడా తన్నడం, కింద పడేసి కాళ్లతో తన్నడం అందులో కనిపించింది. వీడియోలో ఓ పోలీస్ కూడా ఉండడం అతడు ధావన్ తండ్రిని ఆపే ప్రయత్నం చేయడం చూస్తుంటే మరింత నిజంగానే జరిగిందా? అనే అనుమానం వస్తోంది. కానీ..

పంజాబీలు అంతే.. కళాత్మకం

ధావన్ ది ఢిల్లీలో స్థిరపడిన పంజాబీ ఖత్రీ కుటుంబం. అసలు విషయమేమంటే సగటు పంజాబీలు ఎలాగైతే హుషారుగా దూకుడుగా ఉంటారో ధావన్ కూడా అంతే. భాంగ్రా డ్యాన్స్ లు, బాలీవుడ్ స్టెప్పులు, పంజాబీ పాటలు.. డైలాగ్ లు ఇలాంటివన్నీ దైనందిన జీవనంలోనూ చేసేస్తుంటారు. డ్రెస్సింగ్ రూమ్ లోనూ  ధావన్ ఇలానే హడావుడి చేస్తుంటాడు. తాజాగా అతడి తండ్రి కొట్టడం కూడా అలాంటి ప్రాంక్ వీడియోనే.

నిజానికి ధావన్ ఈ సీజన్‌లో 460 పరుగులు చేశాడు. టాప్-4లో ఉన్నాడు. 14 మ్యాచ్‌ల్లో అతడి సగటు 38.33. మూడు అర్ధ శతకాలు సాధించాడు. స్ట్రైక్‌రేట్‌ 122.66. దీన్ని చూస్తే ధావన్ ప్రదర్శన మెరుగ్గానే ఉంది. అంటే.. అతడి తండ్రితో చేసినది ప్రాంక్ అని తెలిసిపోవడం లేదూ..?


Full View
Tags:    

Similar News