మిరాకిల్ః గుర్ర‌పుశాల‌.. సీరం ఇనిస్టిట్యూట్ గా మారింది!

Update: 2021-05-05 03:30 GMT
అద్భుతం జ‌రుగుతున్న‌ప్పుడు ఎవ్వ‌రూ గుర్తించ‌లేరు.. జ‌రిగిన త‌ర్వాత ఎవ్వ‌రూ గుర్తించాల్సిన అవ‌స‌రం లేద‌న్నది గొప్ప సూక్తి. ఇది అక్ష‌రాలా సీరం ఇనిస్టిట్యూట్ కు వ‌ర్తిస్తుంది. సీరం ఇనిస్టిట్యూట్‌ ఘ‌న‌త గురించి ఇవాళ అంద‌రికీ తెలుసు. అంత‌ర్జాతీయంగా కీర్తి ప్ర‌తిష్ట‌లు పొందుతోంది. కానీ.. ఈ సంస్థ ఎలా మొద‌లైందో తెలిస్తే మాత్రం ఖ‌చ్చితం ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తారు.

సీరం ఇనిస్టిట్యూట్ ను అద‌ర్ పూనావాలా తండ్రి సైర‌స్ పూనావాలా కొన్ని ద‌శాబ్దాల క్రితం స్థాపించారు. అయితే.. దాన్ని స్థాపించ‌డానికి య‌థాలాపంగా బీజం ప‌డ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో సైర‌స్ పూనావాలా గుర్రాల‌ను పెంచేవారు. ఆయ‌న పూర్వీకుల నుంచి వ‌చ్చిన వార‌స‌త్వాన్ని సైర‌స్ కొన‌సాగించారు.

అప్ప‌ట్లో.. ముంబైలోని హాఫ్ కైన్ ఇనిస్టిట్యూట్ లో గుర్రాల సీరం నుంచి వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేసేవారు. పూనావాలా గుర్ర‌పుశాల‌లో ముస‌లివైన అశ్వాల‌ను ఆ ఇనిస్టిట్యూట్ కు పంపించేవార‌ట‌. అక్క‌డ వాటి సీర‌మ్ నుంచి వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేసేవారు. కానీ.. దేశానికి స‌రిప‌డా ఉత్ప‌త్తి ఉండేది కాదు. దీనివ‌ల్ల విదేశాల నుంచి వ్యాక్సిన్ ఎక్కువ‌గా వ‌చ్చేద‌ట‌.

ఈ విష‌యమై ఓ మిత్రునితో మాట్లాడుతుండ‌గా.. మ‌న‌మే వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. దీంతో.. వెంట‌నే అశ్వాల‌ను అమ్మేసిన సైర‌స్ పూనావాలా.. వ‌చ్చిన 12 వేల డాల‌ర్ల‌తో 1966లో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించారు. సీర‌మ్ ప్ర‌స్థానం అలా మొద‌లైంది!

సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు ప్ర‌పంచంలో ర‌క‌ర‌కాల‌ వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేసే ప్ర‌ధాన‌ సంస్థ‌ల్లో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ కూడా ఒక‌టి. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ కూడా ఉత్ప‌త్తి చేస్తూ కోట్లాది మంది ప్రాణాలు కాపాడుతోంది సీర‌మ్ ఇనిస్టిట్యూట్.

ప్ర‌స్తుతం ఉత్ప‌త్తి చేస్తున్న కొవిషీల్డ్ కాకుండా.. సీర‌మ్ సొంతంగా మ‌రో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంద‌ట‌. దాదాపు 80 శాతం ఫ‌లితాలు విజ‌య‌వంతంగా ఉన్నాయ‌ట‌. పూర్తిస్థాయిలో రిజ‌ల్ట్ వ‌చ్చాక‌, అనుమ‌తులు ల‌భిస్తే.. భారీగా ఉత్పత్తి చేప‌ట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది సీర‌మ్ ఇనిస్టిట్యూట్‌.
Tags:    

Similar News