తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌.. కేసీఆర్‌తో వైసీపీ ఎమ్మెల్యేలు!

Update: 2022-02-04 05:45 GMT
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వానికి, తెలంగాణ‌లోని టీఆర్ ఎస్ స‌ర్కారుకు మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నా యి. అటు కాళేశ్వ‌రం, ఇటు సీమ ఎత్తిపోత‌లు, జ‌లాల కేటాయింపు, న‌దుల అనుసంధానం.. ఇలా అనేక అంశాల‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మ‌ద్య స‌ఖ్య‌త పెద్ద‌గా లేదు. దీంతో గతంలో అంటే.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఏర్ప‌డినప్పుడు ఉన్న సఖ్య‌త‌, స్నేహం.. ఇరు ప్ర‌భుత్వాల మ‌ధ్య లేదు. అయితే... ఇప్పుడు వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కులు, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌తో రాసుకుని పూసుకుని తిర‌గ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌గా మారింది.

న‌గిరి ఎమ్మెల్యే రోజా,చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డిలు.. తాజాగా కేసీఆర్ వెంటే ఉండ‌డం.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌క‌న్నా.. చాలా చ‌నువుతో వ్య‌వ‌హ‌రించ‌డం.. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. దీంతో ఏమైంది? ఎందుకు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం రంగారెడ్డి శివారులోనిముచ్చింత‌ల్‌లో స‌మ‌తా మూర్తి రామానుజాచార్యుల విగ్ర‌హ‌స్థాప‌న జ‌రుగుతోంది. దీనికి అంద‌రినీ ఆహ్వానించారు. అయితే.. ఈ ఆహ్వానాల్లో .. సీఎం కేసీఆర్‌వెంటే ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

చిన్న‌జీయ‌ర్ స్వామితో క‌లిసి స‌మ‌తా మూర్తి కేంద్రంలోని రామానుజాచార్యుల విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. అయితే.. సాధార‌ణంగా కేసీఆర్ ప‌ర్య‌ట‌న అంటే.. ఆయ‌న అనుంగు మేన‌ల్లుడు సంతోష్ లేదా... ఇత‌ర మంత్రులు ఉంటారు. కానీ, వీరి స్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు... చెవిరెడ్డి, రోజా ఉండ‌డం.. వారు  కూడా సీఎం కేసీఆర్‌తో క‌లిసి విగ్ర‌హ ఏర్పాటు ప‌రిశీలించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.  అయితే...గ‌తం నుంచి రోజా కుటుంబంతో కేసీఆర్‌కు స‌త్సంబంధాలు ఉన్నాయి.

గ‌తంలో త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ వెళ్లిన సంద‌ర్భంలో... మార్గ‌మ‌ధ్యంలో రోజా ఇంటికి కూడా వెళ్లారు. రోజా ఆతిథ్యాన్ని కేసీఆర్ కుటుంబం స్వీక‌రించింది. ఈ సంద‌ర్భంగా న‌దీ జ‌లాల‌ను ఇరు రాష్ట్రాలు ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా పంపిణీ చేసుకుంటాయ‌ని కేసీఆర్ అన్నారు. అయితే.. ఇప్పుడు.. ఇరు ప్ర‌భుత్వాల మ‌ద్య కూడా తీవ్ర విబేధాలు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు... ఎమ్మెల్యేలు.. సీఎం వెంట ఉండ‌డం. ఆయ‌న‌తో కలిసి స‌మతామూర్తి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ ఏర్పాట్లు చూడ‌డం వంటివి ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.
Tags:    

Similar News